తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ఎందుకెళ్లారు..? కేంద్ర పెద్దలతో వరుసబెట్టి ఎందుకు మంతనాలు జరుపుతున్నారు..? హుజూరాబాద్ ఎన్నికలు వాయిదా వేయించడానికే వెళ్లారా..? బీజేపీతో దోస్తీని బలోపేతం చేసుకోడానికి వెళ్లారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలపై చర్చ జరుగుతున్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. మోడీ, కేసీఆర్ లది ఫెవికాల్ బంధమని విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో సోనియా, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా తనను ఎన్నుకున్నందుకు సోనియా, రాహుల్ కు ధన్యవాదాలు తెలిపానన్నారు. ప్రధాని మోడీ టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో స్థలం కేటాయించే బదులు.. అమరవీరుల స్థూపాలకు ఇస్తే బాగుండేదని విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలో… సీఎం యోగిని ఏవిధంగా గెలిపించాలనే విషయాలపైనే మోడీ, అమిత్ షాతో కేసీఆర్ చర్చలు జరిపారని ఆరోపించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయన్న రేవంత్… సమస్యలన్నింటిపైనా ఒక కార్యాచరణను చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే దళిత గిరిజన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కేసీఆర్ చేస్తున్న మోసాలు, అవినీతి గురించి రాహుల్ గాంధీకి వివరించినట్లు చెప్పారు. డిసెంబర్ 9 నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.