పార్టీ ఆఫీస్ శంకుస్థాపన అని చెప్పి హస్తినకెళ్లిన కేసీఆర్.. ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యాక అనేక ప్రశ్నలు తెరపైకొచ్చాయి. బీజేపీ, టీఆర్ఎస్ బంధంపై కాంగ్రెస్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలోనే అసలు.. ఈ భేటీలు రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టమనే చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా సమావేశమయ్యారని.. వారి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయని తాటికాయంత అక్షరాలతో పత్రికల్లో వచ్చింది. అయితే వారి మధ్య కేవలం అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాత్రమే చర్చ జరిగి ఉంటుందా అంటే అది సాధ్యం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా.. లేదా ప్రధాని, ముఖ్యమంత్రులు కలుసుకున్నా దేశ, రాష్ట్ర రాజకీయాల ప్రస్తావన లేకుండా ఉండదని గుర్తు చేస్తున్నారు. అలా చూసినప్పుడు మోడీ, అమిత్ షా, కేసీఆర్ ల మధ్య కచ్చితంగా రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చే ఉంటాయని విశ్లేషణ చేస్తున్నారు. వాళ్లు నిజంగా ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు కనుక ఎవరి వెర్షన్ వాళ్లు చెబుతున్నారని అంటున్నారు. కాకపోతే వాళ్ల భేటీ ప్రజల్లోకి ఎలాంటి సంకేతం తీసుకెళ్తుందనేది ముఖ్యమని చెబుతున్నారు.
ఈ భేటీల వల్ల టీఆర్ఎస్ కంటే బీజేపీకే నష్టమని చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే కేసీఆర్ మార్క్ రాజకీయం ఎవరికీ అంత తొందరగా అర్థం కాదు. సంవత్సరం తరువాత తాను చేద్దామనుకునే పనికి.. ఇప్పుడే పునాది వేసుకుంటారని ఆయన వ్యూహం అర్థం చేసుకునే లోపే టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు జరగాల్సిన నష్టం జరుగుతుందని గుర్తు చేస్తున్నారు. ఆఖరికి నష్ట నివారణ చేసుకునే సమయం కూడా ఉండదని చెప్పుకొస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది అందరూ చూసిందే. కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకుంది. ఆంధ్రాలో అయితే అడ్రస్ లేకుండా పోగా.. తెలంగాణలో పదేళ్లుగా అధికారానికి దూరమైంది. అయితే ఇప్పుడు మోడీ, అమిత్ షాలతో కేసీఆర్ ఎందుకు భేటీ అయ్యారో.. దాని ఆంతర్యం ఏంటో ఎవరికీ తెలియదని అంటున్నారు విశ్లేషకులు. తక్షణమే ప్రధాని, హోంమంత్రితో సమావేశం కావాల్సిన అవసరమైతే లేదని అంటూనే.. వారితో భేటీ జరిగితే తనకు రాజకీయంగా లాభం జరుగుతుందని భావించే కేసీఆర్ కలిసి ఉండొచ్చని విశ్లేషణ చేస్తున్నారు.
ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర.. ఇంకోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ఈ నేపథ్యంలో మోడీ, షాతో కేసీఆర్ భేటీని విశ్లేషణ చేసుకోవాలని అంటున్నారు. కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తాం, జైలుకు పంపుతామని రోజూ పాదయాత్రలో చెబుతున్నారు బండి సంజయ్. ఇటు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇలాంటి వాతావరణంలో ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ భేటీ జరిగింది. దీనివల్ల బీజేపీకే నష్టమని అంటున్నారు విశ్లేషకులు. ఎలాగంటే బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. 2023 లో అధికారంలోకి వస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి టైంలో కేసీఆర్, మోడీని కలవడం వల్ల ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అనే అపోహలు ప్రజల్లోకి బలంగా వెళతాయని చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య అంతర్గతంగా మంచి సంబంధాలే ఉన్నాయని… బయటకు మాత్రం తిట్టుకుంటారని జనం నమ్మే అవకాశం ఉందంటున్నారు. అందుకు కేసీఆర్ ప్రవర్తన కూడా దోహదపడుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గడం, సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటూ గెజిట్ ఇస్తే.. ఇంత వరకు స్పందించకపోవడం, కృష్ణా జలాల వివాదంలో మౌనంగా ఉండడం, ప్రభుత్వ రంగ ఆస్తుల అమ్మకంపై మోడీకి వ్యతిరేకంగా కొట్లాడతానని గ్రేటర్ ఎన్నికల సమయంలో ప్రకటించి వెనక్కి తగ్గడం, ఇలా అనేక అంశాలు మోడీ, కేసీఆర్ ల మధ్య అవగాహన ఉందనే అనుమానాలకు తావిస్తున్నాయని చెబుతున్నారు. మోడీ, షాతో గత భేటీ తర్వాతే కేసీఆర్ చాలా విషయాల్లో యు టర్న్ తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలతో నాడు బీజేపీలోకి వలసలు కూడా ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ కష్టపడి పాదయాత్ర చేసి పార్టీ గ్రాఫ్ పెంచాలని.. ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూసేలా ప్రయత్నం చేస్తుంటే.. కేసీఆర్ భేటీలతో అటువైపు వెళ్లాలనుకున్న వారంతా ఆలోచనలో పడి ఉంటారని విశ్లేషిస్తున్నారు.
త్వరగా ఎన్నిక వస్తే హుజూరాబాద్ లో బీజేపీ గెలవడం ఖాయం అని సర్వేలు చెబుతున్నాయి. కానీ.. మోడీతో కేసీఆర్ భేటీ తర్వాత ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ లో హుజూరాబాద్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మోడీతో చెప్పి కేసీఆరే ఎన్నికను వాయిదా వేయించారని ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాకపోవచ్చు. కానీ.. బీజేపీకి మాత్రం రాజకీయంగా నష్టమని అంటున్నారు విశ్లేషకులు. అటు ఈటలకు కూడా ఇబ్బందేనని చెబుతున్నారు. ఎన్నిక లేటు కావడం టీఆర్ఎస్ కు లాభం చేస్తే మాత్రం.. బీజేపీని ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీలోకి వలసల మాట పక్కనపెడితే.. ఉన్నవాళ్లు కూడా బయటకు వెళ్లడం గ్యారెంటీ అని విశ్లేషణ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే ఈటల గెలుపు నల్లేరుపై నడకేనని సర్వేలు చెబుతున్నాయి. అలాంటిది ఎన్నికను వాయిదా వేసి టీఆర్ఎస్ కు లాభం చేస్తే రాజకీయంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఏం మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇది బీజేపీకి కోలుకొని దెబ్బ అవుతుందని అంటున్నారు. పైగా కాంగ్రెస్ కు రాజకీయంగా లాభం జరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులకు కేంద్రంగా కాంగ్రెస్ తయారవుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ ఊపందుకుందనే చర్చ ఉంది. దీనికితోడు బీజేపీ, టీఆర్ఎస్ ల మైత్రి బయట పడితే హస్తం పార్టీకి తిరుగుండదని అంటున్నారు విశ్లేషకులు. అయితే మోడీ, షాతో భేటీల గురించి ముందుగా ఎవరికీ తెలియకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారని చెబుతున్నారు. లేకుంటే ఇప్పటికే వాళ్ల బంధంపై పెద్దఎత్తున చర్చ జరిగేదని గుర్తు చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ శంకుస్థాపన వైపు రాజకీయ వర్గాలు, ప్రజల దృష్టిని మళ్లించారని అంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జరుపుకునే జెండా పండగను ఆఫీస్ శంకుస్థాపన రోజు జరుపుకోమని చెప్పడం కూడా ఇందులో వ్యూహమేనని విశ్లేషణ చేస్తున్నారు. చివరి దాకా ప్రధాని, హోంమంత్రి అపాయింట్ మెంట్ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. అదే.. శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోకుండా నేరుగా కలిసి ఉంటే.. వారికి రహస్య ఒప్పందం ఉంది.. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో మాత్రమే కుస్తీ అంటూ సోషల్ మీడియాలో ఏకిపడేసేవారని చెబుతున్నారు. అందుకే తనవైపు నుండి అన్ని జాగ్రత్తలు తీసుకొని కేసీఆర్ ఢిల్లీ పెద్దలను కలుసుకున్నారని.. కానీ.. బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం ఏమీ ఆలోచించకుండా అపాయింట్ మెంట్ ఇచ్చి ఉండాలి.. లేదా వారి మధ్య ఉన్న అవగాహనతోనైనా కలిసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి మధ్య ఎలాంటి అవగాహన లేకుండా కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటే మాత్రం.. అధిష్టానం రాష్ట్ర బీజేపీకి నష్టం చేసినట్లేనని విశ్లేషిస్తున్నారు. ఒకవైపు బండి సంజయ్ పాదయాత్ర మరోవైపు హుజూరాబాద్ ఎన్నిక పెట్టుకొని.. కేసీఆర్ ను మోడీ, షా కలవడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని అడుగుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ కు రాజకీయంగా కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.