కేసీఆర్ వారం రోజుల ఢిల్లీ పర్యటనలో ఏం జరిగిందనే చర్చ అటు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. మోడీ, అమిత్ షా, కేసీఆర్ ల మధ్య జరిగిన చర్చల్లో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయా..? వస్తే వేటిపై మాట్లాడుకుని ఉంటారని విశ్లేషణ చేస్తున్నారు. నిజానికి వారి మధ్య రాజకీయాలు ప్రస్తావనకు రాకుండా ఉండే అవకాశమే లేదని రాజకీయ పండితులు తెగేసి చెబుతున్నారు. ఇద్దరు నాయకులు కలిస్తే కచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటారని అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులు, కేంద్రం నుండి అందాల్సిన సాయంతో పాటు వారి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చే ఉంటాయని చెబుతున్నారు.
టీఆర్ఎస్, బీజేపీ వర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం.. రెండు, మూడు కీలక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ ను సీఎం చేసే విషయంపై మాట్లాడుకున్నట్లు సమాచారం. గతంలో ఒకసారి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ను కేంద్రంలోకి రమ్మని అమిత్ షా అడిగారనే చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ఆనాడు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో కూడా రాశారు. ఢిల్లీలో అమిత్ షాను కలిసినప్పుడు కేటీఆర్ ను సీఎంని చేయమని కేసీఆర్ చెప్పినట్లు.. ఆ విషయాన్ని తనతో అమిత్ షా స్వయంగా చెప్పారని రాధాకృష్ణ రాశారు. ఇదే విషయం తాజా భేటీలో కూడా ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చని అంటున్నారు విశ్లేషకులు. బహుశా వారి మధ్య దీనిపై ప్రస్తావనే కాదు.. కేటీఆర్ సీఎం అవుతారనే చర్చ మరోసారి తెర మీదకు వచ్చిందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్దామనుకుని అందుకు సాయం కోసం మోడీ దగ్గరకు వెళ్తే కేసీఆర్ కు కొన్ని కండిషన్స్ పెట్టారని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. అందులో ఒకటి కేటీఆర్ ను సీఎంను చేసి టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరాలి. అయితే నాడు సరేనని అంగీకరించి తరువాత కేసీఆర్ హ్యాండ్ ఇచ్చారనే వాదన ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కాని చర్చ అయితే ఉందని అంటున్నారు విశ్లేషకులు. అందుకే కేసీఆర్ పై మోడీ, షా ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం కూడా ఉందని చెబుతున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సాయాన్ని అందించేనాడు మోడీ, షా మరో రెండు, మూడు కండిషన్స్ కూడా పెట్టారని ఢిల్లీ రాజకీయ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం. ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలిపి తమను దెబ్బకొట్టిన చంద్రబాబును ఓడించడం, 2019 లోక్ సభ ఎన్నికల్లో హంగ్ వస్తే కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం. వీటికి అవసరమైన ఆర్ధిక వనరులను వారికి సమకూర్చడం అనేది కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెట్టిన కండిషన్. కేసీఆర్ ఒకే చెప్పాకే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందనే ప్రచారం కూడా ఉంది. తమకు రాజకీయ ప్రయోజనం లేకుండా మోడీ, అమిత్ షా ఎవరికీ ఏపని చేయరని రాజకీయ కురు వృద్ధుల వాదన. 2019లో కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరాలి అని అంశం కూడా వారి మధ్య కుదిరిన అవగాహనలో ఉందని గుర్తుచేస్తున్నారు విశ్లేషకులు.
చంద్రబాబును ఓడించడానికి కావాల్సిన వ్యూహాన్ని రచించడంతో పాటు.. జగన్ గెలవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు టీడీపీకి ఆర్థిక వనరులు సమకూరకుండా కూడా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. బాబును ఓడించి మోడీ టాస్క్ ను పూర్తి చేశారు. అలాగే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో యూపీఏకు దగ్గరగా ఉండే మమత, దేవగౌడ్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్, హేమంత్ సొరేన్, స్టాలిన్ లను కలసి మనం బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటిద్దాం.. హంగ్ వస్తే ఫెడరల్ ఫ్రంట్ పెడదామని చెప్పి మోడీ రెండో టాస్క్ కూడా ఫుల్ ఫిల్ చేశారు. అయితే బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో ఫెడరల్ ఫ్రంట్ అవసరం రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోడీ ఇచ్చన బాధ్యతలను తాను పూర్తి చేశాను కనుక.. స్వతంత్రంగా వ్యహరించవచ్చు అని కేసీఆర్ అనుకున్నారని చెబుతున్నారు. అందుకే వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం, ఎల్ఐసీ, టెలికాంలతోపాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ.. వాటి నిరర్ధక ఆస్తుల అమ్మకం విషయంలో మోడీ సర్కారుపై ఒంటికాలుపై లేవడమే కాకుండా ఉద్యమం చేస్తానని కూడా ప్రకటించడాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మైహోం, మెఘ, ప్రతిమ శ్రీనివాస్, యశోద హాస్పిటల్ పై ఐటీ సోదాలు జరిగాయని కూడా చెబుతున్నారు. దాంతో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీ, షాలను కలిశారని.. ఆ తర్వాత వ్యవసాయ చట్టాలపై, మోడీ సర్కార్ పై ఉద్యమం చేసే విషయంలో యూటర్న్ తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
Advertisements
టీఆర్ఎస్ అడపాదడపా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుందే తప్ప పొరపాటున కూడా మోడీ, అమిత్ షాలను పల్లెత్తు మాట అనడం లేదు. కేసీఆర్ అయితే ఒక్కమాట కూడా అనడం లేదు. పైగా చాలాకాలం వ్యతిరేకించిన ఆయుష్మాన్ భారత్ లో చేరడమే కాకుండా అది చాలా గొప్ప పథకమని మెచ్చుకున్నారు. దీనిని బట్టి కేసీఆర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ బుర్రలో పుట్టిందే అయితే ఇప్పటికే మోడీపై యుద్ధం చేసేవారని చెబుతున్నారు. పైగా సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటూ గెజిట్ విడుదల చేస్తే కేసీఆర్ మౌనంగా ఉన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. దీన్నిబట్టి మోడీకి వ్యతిరేకంగా ఏపనీ చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోందని అనుమానిస్తున్నారు. కేసీఆర్ ఏక్షణాన ఎలా ఉంటారో తెలియదు. అందుకే కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ ను కేంద్రంలోకి రమ్మంటే ఎలాంటి తలనొప్పి ఉండదు అనే భావనలో మోడీ, షా ఉన్నారని విశ్లేషణ చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకొని అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. ఇది సాధ్యమయ్యే విషయంగా కనిపించడం లేదు. అదీగాక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోతే మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎంపీ సీట్లు కూడా ఇప్పుడు వచ్చిన నాలుగుకన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ అవి కూడా వస్తాయో రావో చెప్పలేని పరిస్థితి. అందుకే ఇప్పుడే నయానో భయానో కేసీఆర్ ను తమ దారికి తెచ్చుకోవాలని మోడీ, షా చూస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. 2024 నాటికి తమ గ్రాఫ్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము కాబట్టి.. ఇప్పుడే టీఆర్ఎస్ ను తమ మిత్రపక్షంగా చేర్చుకోవాలని మోడీ, షా భావిస్తున్నారని అంటున్నారు. అలాగైతే కేసీఆర్ ఎక్కడికి పోలేరు అనేది వారి ఆలోచనగా విశ్లేషిస్తున్నారు. 2023కి ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ అనుకుంటే మాత్రం మోడీ ప్రతిపాదనను అంగీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. అదే నిజం అయితే మోడీ సాయం అవసరం ఉంటుంది.. అప్పుడు ఆయన పెట్టే కండిషన్స్ కు ఒప్పుకోవచ్చని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత టీఆర్ఎస్ వర్గాలు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నాయి.