– ముచ్చింతల్ వైపు కన్నెత్తి చూడని సీఎం!
– శాంతి కల్యాణానికి సైతం డుమ్మా!
– ఎలాంటి విభేదాలు లేవన్న చినజీయర్
– అయినా కూడా పట్టించుకోని కేసీఆర్
– శిలాఫలకం విషయంలో అలక?
– ఇంతకుముందున్న గౌరవం ఇకపై ఉంటుందా?
సమతామూర్తి శిలాఫలకం విషయంలో సీఎం కేసీఆర్ గట్టిగానే హర్టయినట్లు కనిపిస్తోంది. ఆయన రాక కోసమే శాంతి కల్యాణాన్ని వాయిదా వేసినా.. మీరు రావాలని చినజీయర్ ఆహ్వానం పంపినా.. ముచ్చింతల్ వైపు కన్నెత్తి చూడలేదు కేసీఆర్. శనివారం అంగరంగ వైభవంగా ముచ్చింతల్ లోని ఆశ్రమంలో శాంతి కల్యాణం జరిగింది. ఒక్క కేసీఆర్ రాలేదన్న లోటు తప్పితే… నభూతో న భవిష్యత్ అన్నట్లుగా భక్తజన సమక్షంలో చినజీయర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా మూర్తి సాక్షిగా కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం విషయంలో కేసీఆర్ అలకబూనారని ప్రచారం ఉంది. అందులో మోడీ, చినజయర్ ఫోటోలతోపాటు రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ అని రాసి ఉండడం.. తన ఫోటోగానీ, పేరుగానీ ఎక్కడా కనిపించకపోవడంతోనే ఉత్సవాలకు సీఎం వెళ్లలేదని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. చినజీయర్, రామేశ్వరరావు ముందే డిసైడ్ అయి కేసీఆర్ ను పిలవొద్దని అనుకున్నారా? శిలాఫలకం విషయాన్ని కేసీఆర్ దగ్గర వారిద్దరూ దాచారా? ఒక రోజు ముందు కేసీఆర్ కు తెలిసి హర్టయి కార్యక్రమానికి వెళ్లలేదా? చినజీయర్, రామేశ్వరరావుపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా? ఇలా అనేక ప్రశ్నలు రేకెత్తాయి.
అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని మీడియా ముఖంగా ప్రకటించారు చినజీయర్. సమతామూర్తి కేంద్రానికి వచ్చినప్పుడు ఆయనే మొదటి వాలంటీర్ నని చెప్పినట్టు గుర్తు చేశారు. ఆరోగ్యం, ఇతర కార్యక్రమాల వల్లే ఉత్సవాలకు సీఎం రాలేకపోయి ఉంటారని తెలిపారు. శాంతి కల్యాణానికి ఆహ్వానించామని చెప్పారు. చినజీయర్ మీడియా సమావేశం పెట్టి ప్రత్యేకంగా వివరణ ఇచ్చి కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ వెళ్లలేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి.
కేసీఆర్.. ఒక్కసారి ఎవరినైనా టార్గెట్ చేస్తే.. ఇక అంతే సంగతులు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఎందరో ఉద్యమకారులే అందుకు నిదర్శనమని అంటున్నారు విశ్లేషకులు. ఆయన ఎవరినైనా పట్టించుకోకూడదు అనుకుంటే అంతే.. అందుకే శాంతి కల్యాణానికి వెళ్లలేదని చెబుతున్నారు. ఆయనే కాదు కుటుంబసభ్యులు కానీ.. టీఆర్ఎస్ నేతలు కానీ వెళ్లలేదని గుర్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే యాదాద్రి యాగాన్ని కూడా వాయిదా వేయడంతో చినజీయర్ విషయంలో కేసీఆర్ గతంలో ఉన్నంత అభిమానంతో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.
సమతామూర్తి విగ్రహం కోసం ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో కేసీఆర్ సహకరించారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఆశ్రమానికి వెళ్లి పనులను పర్యవేక్షించారు. ఆవిష్కరణకు ముందు కూడా మోడీని ఆహ్వానిస్తానని ప్రకటించారు. కానీ.. సడెన్ గా ఆయనకు బదులు మంత్రి తలసాని శ్రీనివాస్ ను పంపారు. శిలాఫలకం మీద పేరు లేకుండా చేయడంతో కేసీఆర్ కు ఆగ్రహం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఆయన ముచ్చింతల్ వైపు చూడలేదని చెబుతున్నారు. మొత్తంగా చినజీయర్ అంటే ఎంతో గౌరవంగా ఉండే కేసీఆర్.. రానున్న రోజుల్లో ఇంతకుముందులా ఉంటారనేది కష్టమేనని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.