హైదరాబాద్ : స్వచ్ఛంద పదవీ విరమణకు ముందు ఒకసారి ప్రజల్ని స్వయంగా కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల బాట పడుతున్నట్టు తెలుస్తోంది. యువరాజు పట్టాభిషేకానికి ముందే భారీ సంఖ్యలో పార్టీ సభ్యత్వం నమోదుకావడం కేసీఆర్‌కు కొత్త ఉత్సాహం నింపింది. ఈ ఉత్సాహం ఇలావుండగానే తెలంగాణాలో కొత్త చట్టాలు అమల్లోకి తీసురావడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న నినాదంతో కేసీఆర్ ఈ పర్యటన చేస్తున్నారు. ఓపక్క టీజేఎస్, కాంగ్రెస్ ‘జల’ వ్యూహంతో అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టాలన్న లక్ష్యంతో ఉద్యమబాట పట్టిన నేపథ్యంలో సాగు జలాల అంశంపైనే సీఎం కూడా జిల్లాలబాట చేపట్టడం ప్రస్తావనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడేళ్ల స్వల్ప వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన వైనాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నదే కేసీఆర్ పర్యటన లక్ష్యంగా కనపడుతోంది. త్వరలో సీఎం కేసీఆర్ టూర్ షెడ్యుల్ ఖరారయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో వినాయక నిమజ్జనం పూర్తయ్యాక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిపే అవకాశం ఉంది. ఆ తరువాతే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్తారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఐతే, కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి పార్టీ సారధ్యం చేపట్టి అప్పుడు జిల్లాల టూరుకు వెళ్తారా.. లేక సీయం హోదాలోనే వెళ్తారా అనేది త్వరలోనే స్పష్టం కానున్నది.