– 2014లో అదే.. 2018లోనూ అదే..
– కృష్ణా జలాల విషయంలోనూ అంతే..
– ఇప్పుడు మోడీ కామెంట్స్ పైనా..!
– సెంటిమెంట్ తో నెట్టుకొస్తున్న కేసీఆర్!
ప్రజల్లో సెంటిమెంట్ రగిలించడంలో కేసీఆర్ ను కొట్టేవారు లేరేమో. ఎప్పుడు కష్టాల్లో ఉన్నా దానిపైనే భారం వేసి నెట్టుకొస్తున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ పన్నిన వ్యూహాల్ని ఓసారి పరిశీలిస్తే అదే నిజమని అంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటూ టీఆర్ఎస్ విజయాలు సాధిస్తూ వస్తోందని చెబుతున్నారు.
ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం.. తెలంగాణ ఏర్పడుతున్న రోజులవి. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఇలా సకల జనుల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అప్పటి యూపీఏ సర్కార్ అంగీకారం తెలిపింది. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్, సహకరించామని బీజేపీ, టీడీపీ ఎన్నికలకు వెళ్లాయి.. కానీ.. ప్రజలు మాత్రం కేసీఆర్ నే నమ్మారు. దానికి కారణం.. తన వల్లే రాష్ట్రం వచ్చిందన్న సెంటిమెంట్ ను వారిలో కలిగించడంలో ఆయన సక్సెస్ కావడమేనని అంటున్నారు విశ్లేషకులు.
ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలనే చూడండి. అప్పుడు కాంగ్రెస్ తో టీడీపీ జట్టుకట్టడం పెద్ద మైనస్ అయింది. ఆ సమయంలో చంద్రబాబు దూకుడు తగ్గించేందుకు మరోసారి కేసీఆర్ సెంటిమెంట్ రాజేసి మంచి ఫ లితాలు సాధించారు. తర్వాత ఏపీ సీఎం జగన్ ను ఇంటికి పిలిచి పప్పన్నం పెట్టి.. కొన్నాళ్లకు జల జగడం అంటూ అదే ప్రయత్నం చేశారు. ఇలా తనకు కష్టం వచ్చిన ప్రతీసారి ప్రజల్లో సెంటిమెంట్ ను రగిలిస్తూ కేసీఆర్ నెట్టుకొస్తున్నారని విశ్లేషణ చేస్తున్నారు రాజకీయ పండితులు.
అయితే.. ఇటీవలి కాలంలో సెంటిమెంట్ తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండగా.. పార్లమెంట్ లో ప్రధాని మోడీ వ్యాఖ్యలతో మరోసారి ఆ అస్త్రాన్ని కేసీఆర్ ప్రయోగిస్తున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు. బీజేపీ గెలిస్తే ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేస్తారన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ ఏ మీటింగ్ కు వెళ్లినా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. ప్రజలకు ఈ విషయాన్ని పదే పదే చెబుతూ సెంటిమెంట్ వర్కవుట్ చేస్తున్నారని అంటున్నారు.
నిజానికి టీఆర్ఎస్ కు సెంటిమెంట్ ను మించిన అస్త్రం లేదనేది విశ్లేషకుల వాదన. ఉద్యమం సమయం నుంచి ఇప్పటిదాకా అదే ఫాలో అవుతున్నారని చెబుతున్నారు. మరి.. ఈసారి ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.