– ఇక బంగారు ‘భారత్’..
– కేసీఆర్ కొత్త ఎత్తుగడ
– జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ అధినేత
– తెలంగాణలో ఏం చేయలేదని ప్రతిపక్షాల విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దేశానికి దిశానిర్దేశం చేస్తారని, సంచలనాలు సృష్టిస్తాడని చెప్తున్నారు. కానీ, అవన్నీ ఉట్టి మాటలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తాడా?’ అన్న సామెత కేసీఆర్కు వర్తిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉండి చేసిందేమీ లేదని, కనీసంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏదో చేస్తానని కేసీఆర్ ఉట్టి ప్రగల్భాలు పలుకుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక షోషించగలరా? అది సాధ్యమేనా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు..దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, ‘డబుల్’ ఇళ్లు, తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణ, హుస్సేన్ సాగర్ శుద్ధి, 150 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట, పాత్రికేయులకు ఇళ్లు వంటి విషయాలపైన కనీసంగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా సక్సెస్ అవుతారనే చర్చ జరుగుతున్నది.
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని ఉద్యమ సందర్భంగా, ఎన్నికల సభలలో కేసీఆర్ పేర్కొన్నారు. కానీ, ఆ హామీల అమలు మరిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బంగారు భారత్ అనే నినాదంతో కొత్త ఎత్తుగడతో మరో నాటకానికి కేసీఆర్ తెరలేపారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కేజీ టు పీజీ ఉచిత వద్య, దళితులకు మూడెకరాల భూమి, దళిత కుటుంబాలన్నిటికీ దళిత బంధు, లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నడం, నిరుద్యోగ భృతి, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కరీంనగర్ను లండన్ చేయడం, పాతబస్తీని ఇస్తాంబుల్ చేయడం, ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ వంటి హామీలన్నీ నెరవేర్చిన కేసీఆర్..ఇక బంగారు భారత్ కోసం బయలుదేరాడా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన కేసీఆర్..త్వరలో రైతులకు పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారని, అదొక్కటే బాకీ ఉందని వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు.