– మోడీని గద్దె దించుతానన్న చంద్రబాబు
– తీరా చూస్తే తెలంగాణలో అడ్రస్ గల్లంతు!
– చంద్రబాబు లాగే చేస్తున్న కేసీఆర్!
– టీఆర్ఎస్ అడ్రస్ కూడా గల్లంతేనా?
థర్డ్ ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తున్న కేసీఆర్ చర్యలను గమనించారా? ప్రాంతీయ పార్టీల నేతలకు ఫోన్లు, డైరెక్ట్ మీటింగులు, ఫోటోలకు ఫోజులు.. ఎక్కడో చూసినట్టు ఉంది కదా..? 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసినవి గుర్తుకొస్తున్నాయి కదా..? అవును.. కేసీఆర్ మాజీ బాస్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మోడీ సర్కార్ పై 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఏ విధంగా తిరగబడ్డారో.. అచ్చం అలాగే ఇప్పుడు కేసీఆర్ రాజకీయ అడుగులు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
ఆనాడు చంద్రబాబు ధర్మయుద్ధం అంటూ మోడీని టార్గెట్ చేస్తూ సభలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మోడీ సర్కార్ ను గద్దె దించుతానని జనగామ, భువనగిరి, నారాయణఖేడ్ సభలతో కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ మూడు సభలను గమనిస్తే.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నిర్వహించిన మోడీ వ్యతిరేక సభలను తలపిస్తున్నాయనేది విశ్లేషకుల వాదన. ఇక నాయకులతో భేటీలు సరేసరి. ఇప్పటివరకు ఫోన్లలో మంతనాలు జరిపిన కేసీఆర్.. తాజాగా నేరుగా ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు.
ముంబై వెళ్లి థాక్రే, శరద్ పవార్ ను కలిశారు కేసీఆర్. ఇంకా మిగిలిన వారిని కలుస్తానని చెప్పారు. అయితే.. వాళ్లిద్దరితో కలిసి దిగిన ఫోటోలు, ప్రెస్ మీట్లు పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయని చెబుతున్నారు రాజకీయ పండితులు. గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఇలాగే పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల్ని కలవటం.. వారితో కలిసి ఫోటోలు దిగటం.. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని చెప్పటం లాంటివి చేశారు. పైగా బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. తీరా చూస్తే తెలంగాణలో కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది టీడీపీ. అటు ఏపీలోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు లాగే కేసీఆర్ కూడా కేంద్ర రాజకీయాల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారు. బంగారు తెలంగాణ నినాదం కాస్తా.. బంగారు భారతంగా మార్చేశారు. ప్రస్తుతానికి మాంచి ఉత్సాహంతో ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చం మాజీ బాస్ లాగే చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నా యి. సోషల్ మీడియాలో అయితే అప్పటి చంద్రబాబు ఫోటోలను, ఇప్పటి కేసీఆర్ ఫోటోలను కలిపి.. భవిష్యత్తు కనిపిస్తోంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మోడీని గద్దె దింపుతానని ఆనాడు చంద్రబాబు బీరాలు పలికారని.. ఇప్పుడు కేసీఆర్ అదే పాట పాడుతున్నారని అంటున్నారు.
ఈమధ్య కేసీఆర్ స్వరం మారింది. రాహుల్ గాంధీపై తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. అసోం సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల కంటే ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు. అటు చూస్తే శివసేన ఎంపీ కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తున్న విశ్లేషకులు.. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెస్ తో ఎలా జట్టు కట్టారో.. కేసీఆర్ కూడా అలాగే చేసినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడడం వెనుక ఇదే వ్యూహం అయి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్దతు కోసం అనైతిక పొత్తులు, ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రకటనలు.. ఇలా ఆనాడు చంద్రబాబు ఏం చేశారో కేసీఆర్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారని చెబుతున్నారు.