హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల తర్వాత సీయం కేసీఆర్ తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిపారు. కొత్తగా ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన గవర్నర్‌గా ఇదే రోజు బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందర్‌రాజన్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రెండోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి జరిగిన మంత్రివర్గ విస్తరణ కావడంతో జాబితాపై కాస్త ఉత్కంఠ నెలకొంది. ఊహించిన వారికే కేబినెట్‌లో చోటు దక్కింది.
కేటీఆర్, హరీశ్‌రావు టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. ఇద్దరూ వెలమ సామాజిక వర్గానికి, అది కూడా కేసీఆర్ కుటుంబానికి చెందిన వారు. సబితా ఇంద్రారెడ్డి ఈమధ్యనే టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరు. గంగుల కమలాకర్, అజయ్ ఎమ్మెల్యేలు. సత్యవతి ఎమ్మెల్సీ. గంగుల మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అజయ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. సత్యవతి ఎస్టీ-లంబాడి. ఇద్దరు మహిళలను కేబినెట్‌లోకి తీసుకుంటానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన దరిమిలా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి ఇద్దరికీ అవకాశం ఇచ్చారు.