టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందా? అందుకే సీపీఐ మద్దతు కోరిందా? కేసీఆర్ తన ప్రతినిధి బృందాన్ని ఎందుకు హుటాహుటిన ముగ్ధుమ్ భవన్‌కు పంపినట్లు? సీపీఐని టీఆరెస్‌కు మద్దతు ఇవ్వమని కన్విన్స్ అయినా చేయాలి, లేదా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వొద్దని కన్ఫ్యూజ్ అయినా చేయలనే సిద్ధాంతాన్ని మనస్సులో పెట్టుకొని తన బృందాన్ని పంపించి ఉంటాడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
హుజుర్‌నగర్ ఉపఎన్నిక టీఆరెస్‌కు తలనొప్పిగా తయారైంది. పైకి గెలుస్తామని ధీమా ప్రదర్శిస్తున్నా లోలోపల భయం వెంటాడుతోంది. జరుగుతున్న పరిణామాలే ఈ భయాన్ని బయటపెడుతున్నాయి. కేటీఆర్ 25 మంది ఇంచార్జ్‌లను నియమిస్తే కేసీఆర్ సరిపోరని అరవై మందిని ఇంఛార్జీలుగా పంపించాడు. పైగా ఎప్పుడూ లేని విధంగా కులాల వారీగా వెతికి మారి నియమించాడు. దసరా పండుగకు కూడా మీరు హుజుర్‌నగర్ వదిలి వెళ్లద్దని హుకుం జారీచేశాడు. పైగా టీఆరెస్‌లో ఎప్పుడూ లేని విధంగా ఇంచార్జ్‌లుగా నియమించిన వారందరికి ఖర్చుల కోసం 50 వేల రూపాయలు ఇచ్చి పంపించారు. మరోవైపు సర్పంచుల సంఘం అధ్యక్షుడితో పాటు ఇతర నాయకులను టాస్క్‌ఫోర్స్ పోలీసుల చేత లిఫ్టు చేయించి బెదిరించి లొంగకపోతే పాత కేసులలో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు పంపారు. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా నాడు రైతులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సుమారు రెండు వందల మంది రైతులు నామినేషన్ వేస్తే కేసీఆర్ లైట్ తీసుకున్నాడు. కొంతమంది టీఆరెస్ నాయకులు రైతులను పిలిచి మాట్లాడదాం అని సూచించినా కేసీఆర్ ససేమిరా అన్నాడు. ఆ తరువాత ఫలితాలు ఎలా వచ్చాయో అందరికి తెలిసిందే. బతుకమ్మ పండక్కి సంబరంగా తిరిగి సంబురాలు చేసుకోవాల్సిన కూతురు ఓటమి భారంతో బయటికే రాలేకపోతోందని అంటున్నారు. ఇప్పుడు సర్పంచులు సామూహికంగా నామినేషన్లు వేస్తే టీఆరెస్‌కు కష్టం తప్పదని గ్రహించిన కేసీఆర్ వారిని సామ, దాన, దండోపాయాలన్నీ ప్రయోగించాడు. ఎలాగో అలా దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఈ బాధ్యత పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అప్పగించాడు. మరోవైపు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణతో లోపాయికారిగా మాట్లాడి టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపించారని అంటున్నారు.
మొన్నటి సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కాంగ్రెస్‌తో జతకట్టింది. కానీ ఈసారి తెలుగుదేశం వాళ్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా సొంతంగా అభ్యర్ధిని బరిలో దింపారు. అందుకే రమణ ద్వారా టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపేందుకు కేసీఆర్ తెరవెనుక మంత్రాంగం చేశాడని ఓ కధనం. ఇలా చేయడానికి గల కారణం ఇంకేం లేదు, కేవలం ఓటమి భయమేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఇప్పటికే మంత్రులు హుజుర్‌నగర్‌లో తిష్టవేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులను లొంగతీసుకునే పని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అప్పగించారు. దీంతో ఆయన ‘ఈ ఉపఎన్నిక కాగానే జగదీష్ రెడ్డిని తీసేసి నన్ను మంత్రిని చేస్తారు.. మీకు నేను అండగా ఉంటాను.. మీరు టీఆరెస్‌లో చేరండి’ అంటూ కాంగ్రెస్ వారికి గేలం వేస్తున్నాడు. దీనిపై ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్ గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేశాడు. రాజ్యాంగబద్ధమైన పోస్టులో వుంటూ ఈ చిల్లర పనులు ఏమిటి అంటూ.
ఎన్ని మేనేజ్ చేసినా ఎక్కడో ఓటమి వెంటాడుతోంది. అందుకే ఇన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న సీపీఐతో రాయబారం నడుపుతున్నారు. కేసీఆర్ మీద ఒంటి కాలు మీద లేచే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి టీఆరెస్ ప్రతినిధి బృందానికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చెప్పడం దీనికి నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలను వివరించడానికి గత నాలుగేళ్ళుగా మేం ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నిస్తున్నా మాకు అవకాశం ఇవ్వడం లేదని బహిరంగంగా విమర్శించిన చాడ.. ఇప్పుడు టీఆరెస్ ప్రతినిధులు ఆడిగిందే తడవు ముగ్ధుమ్ భవన్‌లో రెడ్ కార్పెట్ పరచి మరీ స్వాగతం పలికాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఎన్నికలలో కాంగ్రెస్‌తో ఉన్న తెలుగుదేశం పార్టీని ఒంటరిగా బరిలోకి దించడం, సీపీఐ నుంచి టీఆరెస్‌కు మద్దతు తీసుకోవడం జరిగితే గెలుపు అవకాశాలు మెరుగవుతాయని, లేదంటే టీఆరెస్ గెలవడం కష్టం అని గుర్తించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు అంటున్నాయి రాజకీయవర్గాలు. మొత్తానికి టీఆరెస్‌కు ఓటమి భయం వెంటాడుతుంది అనేది మాత్రం స్పష్టంగా బయటపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.