జార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ముందుగా అక్కడి విమానాశ్రయం నుండి నేరుగా గిరిజన ఉద్యమ నేత బిర్సా ముండా విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి వెళ్లారు. వీరిద్దరూ గతంలో యూపీఏ హయాంలో కేంద్రమంత్రులుగా పనిచేశారు.
దేశ రాజకీయాలు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు కేసీఆర్. అమర జవాన్ల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు.
చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించింది. అదే సమయంలో అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్ ఆ సమయంలో ప్రకటించారు.
Advertisements
ఇచ్చిన హామీ ప్రకారం ఇద్దరు జవాన్ల కుటుంబాలకు సాయాన్ని అందించారు. పర్యటన నేపథ్యంలో రాంచీ నగరంలో పలు చోట్ల కేసీఆర్ పేరిట బ్యానర్లు, కటౌట్లు దర్శనమిచ్చాయి. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అనే నినాదాలు ఉన్న కటౌట్లతో రాంచీ నగరంలోని వీధులు గులాబీమయమయ్యాయి.