కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదో పనికి మాలిన బడ్జెట్ అని అన్నారు. బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం అని దుయ్యబట్టారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గతంలో ప్రగల్బాలు పలికిన బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఈ బడ్జెట్ లో అయినా వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవని అన్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి 700 మంది రైతులు చనిపోతే వారి ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో లేకపోవడం దారుణమని విమర్శించారు. రైతులకు ఏమీ చేయకపోగా యూరియాపై రాయితీ తగ్గించారన్న కేసీఆర్.. ఎరువులపై రూ.35 వేల కోట్లు రాయితీ తగ్గించారని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ రూ.25 వేల కోట్ల కోత విధించారని తెలిపారు.
దిక్కుమాలిన గుజరాత్ మోడల్ ని అడ్డుపెట్టుకొని మోడీ ప్రధాని అయ్యారని మండిపడ్డారు. దేశం బాగుపడాలంటే బీజేపీని అంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్టు అని ప్రశ్నించారు. బీజేపీ దేశాన్ని, ఓట్లు వేసిన ప్రజలను అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 101 స్థానంలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ కంటే వెనబడి ఉన్నామని తెలిపారు. గ్లోబల్ ఇండెక్స్‌లో దేశం ర్యాంక్ దిగజారిందని దేశం ఘోషిస్తుంటే ఆహార సబ్సిడీని కూడా తగ్గించారని అన్నారు. బడ్జెట్‌లో కనీసం మద్ధతు ధర ప్రస్తావన లేదు, కరెంట్ మీటర్లు పెట్టబోమని చెప్పలేదు. ఇలాంటి బడ్జెట్ ఎందుకని ప్రశ్నించారు.
ఎయిరిండియాను అమ్మేశారు. అద్భుతమైన ఎల్‌ఐసీని అమ్ముతామని అంటున్నారు. ఎవరిని ఉద్దరించడానికి ప్రభుత్వ ఆస్తులు అమ్మకానికి పెడుతున్నారని నిలదీశారు. నల్ల ధనం తెచ్చి ప్రతీ ఇంటికి రూ. 15 లక్షలు ఇస్తామన్నారు ఇచ్చారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. బ్లాక్ మనీని తేలేదు, బ్లాక్ మనీ సంపాదించిన వారికి దేశం నుంచి బయటకు పంపించారంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.