అధికార టీఆర్ఎస్ చూపు ఇప్పుడు మళ్లీ కుల సంఘాలపై పడింది. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి రాగానే వరుసగా కుల సంఘాలకు భవనాలు కట్టేందుకు భూమి పూజలు చేశారు. తల ఎకరం, రెండు ఎకరాల చొప్పున మంత్రులతో పోటీ పడి ప్రమాణస్వీకారాలు చేయించారు. ఈ భవనాలకు కేవలం కుల సంఘాలు భవనాలు మాత్రమే కాదని, వారి ఆత్మగౌరవ ప్రతీకలంటూ గొప్పగా ప్రకటించుకున్నారు.
సీన్ కట్ చేస్తే… భవనాల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. భవనాలు పూర్తయ్యింది లేదు… వారికి ఒరిగింది లేదు. గొల్ల కురుమలకు పెద్దపీట అంటూ ఒకరిద్దరి నేతలకు పదవులు మాత్రం ఇచ్చారు. అది కూడా వారి సొంత పార్టీ నేతలకే.
రెండోసారి అధికారంలో వచ్చాక కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై వరుసగా యూటర్న్ లు వస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి నిర్ణయాలు మారుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరోసారి కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. మంత్రులు ఈటెల, గంగుల, కేశవరావు వంటి నేతలంతా కుల సంఘాలకు గుర్తింపు అంటూ గొప్పగా చెప్పుకున్నారు.
దీంతో… కేసీఆర్ జమిలీకి రెడీ అవుతున్నారని, అందుకే ఈ యూటర్న్ లు… ఓపెనింగులు, హామీలు, ఉద్యోగ భర్తీ అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ కు, రాజకీయ పార్టీలకు ఎన్నికలప్పుడే కుల సంఘాలు గుర్తుకొస్తాయని… కేసీఆర్ పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు అంచనా వేస్తున్నారు.