– మరికొన్ని గంటల్లో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన!
– ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారా?
– మూడు ప్రధాన పార్టీలపై ఫోకస్ చేశారా?
– బెదిరింపులతో వైసీపీని దారికి తెచ్చుకుంటున్నారా?
– పాత పరిచయాలతో టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారా?
– జనసేనతో ప్రయాణానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారా?
– రాజకీయ వర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు టైమ్ దగ్గర పడింది. ఈ నేపథ్యంలో రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. దేశంలో బలంగా ఉన్న బీజేపీని ఢీ కొట్టేందుకు కేసీఆర్ జాతీయ పార్టీ తెస్తున్నారనేది టీఆర్ఎస్ వాదన. జాతీయ పార్టీ అంటే అంత ఆషామాషీ కాదు. పైగా కాంగ్రెస్ తో సంబంధం లేకుండా పోరాటం అంటే మామూలుగా ఉండదు. అందుకే.. ఇవన్నీ గ్రహించే కేసీఆర్ పక్కా ప్లాన్ తోనే వ్యూహాలు రచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఫోకస్ అంతా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలపైనే ఉందని.. ముఖ్యంగా ఏపీపై ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు విశ్లేషకులు.
ఏపీలో ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉంది. ప్రధాన ప్రతిపక్షాలుగా టీడీపీ, జనసేన ఉన్నాయి. అయితే, కేసీఆర్ జాతీయ పార్టీకి ఈ మూడు పార్టీల్లో ఏది మద్దతిస్తుందా? అనేది ఇంట్రస్టింగ్ అంశం. అయితే, కేసీఆర్ మాత్రం అన్ని పార్టీలను లైన్ లో పెడుతున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. దానికి కారణం ఉంది. ప్రస్తుతానికి అధికారమే లక్ష్యంగా కాకపోయినప్పటికీ.. పార్టీకి ఓట్ల శాతం, కొన్ని స్థానాల్లో గెలుపొందడమే కేసీఆర్ ముఖ్య ఉద్దేశంగా విశ్లేషణ చేస్తున్నారు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జాతీయ పార్టీ హోదా పొందాలంటే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది. ఇందుకోసమే కేసీఆర్ ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొత్త పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపేందుకు సిద్దమయ్యారని అంటున్నారు.
ఏపీపై ఫోకస్ చేసిన కేసీఆర్.. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ తో ఉన్న పగల కారణంగా టీడీపీ కేసీఆర్ కు మద్దతుగా నిలిచే ఛాన్స్ లేదు. పైగా గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం వైసీపీకి నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత పరిచయాలను అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని వెలమ సామాజికవర్గం నేతలతో కేసీఆర్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. అలాగే సామాజిక సమీకరణాల కారణంగా పార్టీలో టికెట్లు దక్కనివారిని, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముఖ్య నేతల వివరాలు కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక మింగలేక కక్కలేని పరిస్థితిలో వైసీపీ ఉన్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. దానికి రెండు కారణాలను చెబుతున్నారు. ఒకటి.. కేంద్రంతో కొరివి ఎందుకులే అని కాంప్రమైజ్ పాలిటిక్స్ నడిపిస్తున్న జగన్.. బీజేపీని ఢీ కొడతానంటున్న కేసీఆర్ కు మద్దతు తెలిపే ఛాన్స్ తక్కువే అని చెబుతున్నారు. అయితే, కేసీఆర్ తో పగ కూడా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. వైసీపీ నేతల ఆస్తులు, వ్యాపారాలు చాలావరకు హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తో గొడవ పెట్టుకుంటే మాత్రం వచ్చే ఎన్నికల సమయానికి డబ్బుల విషయంలో కష్టాలు ఎదురవతాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అందుకే.. టీఆర్ఎస్ మంత్రులు తెగ తిట్టిపోస్తున్నా.. వైసీపీ నేతలు ఒకరోజు హడావుడి చేసి తర్వాత సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇలా బెదిరింపులతో కేసీఆర్ వారిని దారిలోకి తెచ్చినా తెచ్చుకునే ఛాన్స్ ఉందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ జాతీయ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ సాగుతోంది. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్నా రెండు పార్టీలు వేర్వేరు దారుల్లో నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. పైగా తెలంగాణ బీజేపీ నేతలు పవన్ ను ఆమధ్య విమర్శించారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి జనసేన మద్దతు ప్రకటించింది. దీనికితోడు కేంద్ర నేతలు పవన్ ను లైట్ తీసుకుంటున్నట్లుగా కొన్ని పరిణామాలు ఉదాహరణగా ఉండనే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో పవన్ తో కేసీఆర్ సంప్రదింపులు జరిపి తనవైపు తిప్పుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించి ఓట్లు, సీట్ల శాతాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతోనే ఉన్నట్లుగా చెబుతున్నారు రాజకీయ పండితులు.