– బీఆర్ఎస్ కు కీలక టైమ్ స్టార్ట్స్
– ముందు అసెంబ్లీ.. తర్వాత పార్లమెంట్
– 2023, 24లో సవాళ్లెన్నో!
– అసెంబ్లీ ఎలక్షన్ కోసం ఇప్పటికే భారీ ప్లాన్స్
– పథకాలు, అభివృద్ధిపై గులాబీ బాస్ ఫోకస్
– పార్లమెంట్ ఎన్నికలపైనా దృష్టి
– మిషన్ వందకు శ్రీకారం..!
– కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నంలో ప్రతిపక్షాలు
జాతీయ రాజకీయాల కోసం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. అయితే.. ఇది అంత ఈజీ విషయం కాదు. భవిష్యత్ సవాళ్లతో కూడుకున్నది. ఈ కొత్త ఏడాదిలో ఆయనకు ముందుగా ఎదురయ్యే సవాల్.. అసెంబ్లీ ఎన్నికలు. మొదటిసారి గెలిచినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తో సాధించిన సీట్లు తక్కువే. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకుని బలం పెంచుకున్నారు. రెండోసారి ముందస్తుకు వెళ్లారు. పైగా ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేయడం కేసీఆర్ కు బాగా కలిసొచ్చింది. మరోసారి అధికారం దక్కింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు. గెలుపు తమదేనని ధీమాతోనే ఉన్నారు. అయితే.. ఈ కొత్త ఏడాది కేసీఆర్ కు చాలా కీలకమైన టైమ్.
రెండో దఫాలో నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న కేసీఆర్ సర్కార్.. మార్చిలో ప్రస్తుత టర్మ్ కు సంబంధించిన చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉన్న ఈ సమయంలో ప్రజా సంక్షేమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. నిధుల వరద పారిస్తేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అభివృద్ధి, పథకాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. నియోజకవర్గాల్లో నేతల్ని, అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో గత హామీలపైనా ఫోకస్ పెట్టారు. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు జరుపుతున్నారు. నూతన అసెంబ్లీ సిద్ధమైంది. ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వరుసగా వదులుతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఇవన్నీ చేస్తున్నారు.
ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టడంతో కేసీఆర్ దూకుడుకు బ్రేక్ వేసేందుకు ప్రతిపక్షాలు సైతం ధీటుగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసిన జనాలకు ఒక్క ఛాన్స్ ఇవ్వండని అంటోంది బీజేపీ. ప్రజలను ఆలోచనలో పడేసే ప్రయత్నం చేస్తోంది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓ క్లారిటీతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది. కానీ, అన్నీ సెట్ రైట్ అయి అధికారం దక్కించుకుంటామని ధీమాగా చెప్తోంది. ఇటు వైటీపీ, బీఎస్పీ కూడా సందడి చేస్తున్నాయి. కేసీఆర్ ను గద్దె దించడమే తమ లక్ష్యం అని ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి. అందుకే కేసీఆర్ కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. నిత్యం ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఓ అభివృద్ధి కార్యక్రమం ఉండేలా చూసుకుంటున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ హడావుడి చేస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికలే కాదు.. 2024 పార్లమెంట్ ఎన్నికలపైనా కేసీఆర్ ఫవర్ ఫుల్ ప్లాన్స్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా 2024లో ఓ బలమైన శక్తిగా అవతరించాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి పలు రాష్ట్రాల్లో కిసాన్ సమితిలను ఏర్పాటు చేశారు. 2024 ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే ఎన్నికల్లో భారీగా సీట్లు గెలుచుకోవడానికి వ్యూహం సిద్ధం చేస్తున్నారు. మిషన్-100 పేరుతో దేశవ్యాప్తంగా కనీసం 100 సీట్లు గెలుచుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పోటీ చేయాల్సిన 60 లోక్ సభ స్థానాలను గుర్తించినట్లు తెలుస్తోంది. 11 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కలసి వచ్చే బీజేపీయేతర పార్టీలతో బరిలోకి దిగాలని ప్రాథమికంగా నిర్ణయించారట. మిషన్-100 గురించి పార్టీ సీనియర్లతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. అంటే.. ఇప్పటి నుంచే దానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం దూకుడుగా వెళ్తూనే ఇంకోవైపు పార్లమెంట్ స్థానాల్లో సత్తా చాటాలని చూస్తున్నారట కేసీఆర్. ఈ కొత్త ఏడాదిలో గులాబీ బాస్ ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.