– ఆంధ్రా కాపులకు కేసీఆర్ బిర్యానీ
– కాపు నేతృత్వంలో కుల సమీకరణ
– కే.బీ.వీ.కే.డీ.ఎం అంటున్న కారు నేతలు
– ఇప్పటికే కాపు ఎజెండాలో ఆంధ్రా పార్టీలు
– కేవీపీ వ్యూహంతో ఆంధ్రాలో గులాబీ జెండా
ఎప్పుడొచ్చామన్నది కాదు.. కరెక్ట్ టైమ్ కి దిగామా లేదా? అనేదే ముఖ్యమంటున్నారు గులాబీ నేతలు. ఆంధ్రాలో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ భారీ స్కెచ్ వేస్తున్నారు కాబట్టే ఆపార్టీ నేతలు అంతలా ధీమాతో ఉన్నారు. కాపు, బలిజ, వైశ్య, కొప్పుల, వెలమ, దళిత, ముస్లిం వర్గాలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నది గులాబీ దళాల మాట. ఆంధ్రా చాణక్యుడు కేవీపీ మార్గ దర్శకత్వంలో ఎన్నికల విజయం కోసం పని చేస్తారట.
ఇప్పటికే ఆంధ్రా కాపు సామాజికవర్గం.. వివిధ రాజకీయ పక్షాలు చూపుతున్న ప్రేమ చూసి ఉబ్బి తబ్బిబ్బవుతోంది. బీజేపీ తమ నేత రాంమాధవ్ చూపించిన కాపు ఓటు ద్వారా రాజ్యాధికారం అన్న ఫార్ములాను తూచ తప్పక పాటిస్తోంది. నాయకత్వాన్ని ఆ వర్గానికి అప్పగించడంతోపాటు కాపు సంక్షేమం కోసమే పని చేస్తున్నామని చూపించే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుల రహిత పార్టీ నిర్మిస్తానని చెబుతున్నారు. కానీ, ఆయన అనుచరగణం కాపు సామాజికవర్గం ఐక్యతే తమ లక్ష్యమని నిర్మొహమాటంగా చెబుతోంది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే మొదట్నుంచి ఆ పార్టీకున్న బీసీ మద్దతును కూడా వదులుకుని గత ఎన్నికల ముందు కాపు ప్రేమను పదర్శించింది. కాపు కార్పొరేషన్ తో వరాల జల్లు కురిపించింది. వైసీపీ కూడా కాపులపట్ల ప్రేమలో వెనుకబడలేదు. ఆ పార్టీలోని కాపు వర్గ నేతలకు పెద్దపీట వేసింది.
అన్ని పార్టీలతోపాటు ఇప్పుడు కేసీఆర్ కూడా కాపు ఎజెండాను ఆంధ్రా రాజకీయ రంగంపైకి మరోసారి తీసుకువచ్చారు. ఓటుబ్యాంక్ రాజకీయాలతో విభజించబడిన కాపులను ఏకం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. మరి.. కాపు నేతృత్వంలో కేసీఆర్ చేస్తున్న కులసమీకరణ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలంటున్నారు రాజకీయ పండితులు.