– మెగా కృష్ణారెడ్డికి.. కేటీఆర్ ఎర్త్
– తొలివెలుగు కథనాలతో కేసీఆర్ ఎంట్రీ
– నిఘా వర్గాలకు ప్రత్యేక ఆదేశాలు
– రజత్ కుమార్ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్
– లోగుట్టంతా తెలుసుకోవాలని ప్రయత్నాలు
– మెగా ఆఫర్స్ లో ఎంతమంది జీహుజూర్ లు..
– వివరాలు సేకరించే పనిలో ఇంటెలిజెన్స్ పోలీసులు
రజత్ కుమార్ అంశం కేసీఆర్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్ తెరచాటు బంధంపై తొలివెలుగు కథనాలను ఇస్తోంది. వారిపై ఆగ్రహంతో ఉన్నదెవరు.. సీక్రెట్ బిల్లులు బయటకు వచ్చేలా చేసిందెవరు అంటూ వార్తలు రాసింది. దీంతో ఈ వ్యవహారంపై అసలు విషయాలను బయటకు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రజత్ కుమార్ వ్యవహారంపై రాష్ట్ర నిఘా వర్గాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
డిసెంబర్ లో జరిగిన రజత్ కుమార్ కుమార్తె వివాహం సందర్భంగా మెగా సంస్థ బిల్లులు చెల్లించడంపై అన్ని లెక్కలు తీస్తున్నారట. అంతేకాకుండా నీటిపారుదల శాఖ అధికారులకు ఏ సమయాల్లో ఎంత మేరకు ముట్టాయనే వివరాలపై కూడా దృష్టి పెట్టారని తెలుస్తోంది. తొలివెలుగు ఇవే అంశాలను హైలెట్ చేస్తూ కథనాలను ఇచ్చింది. ఆపరేషన్ మ్యారేజ్ గేట్ రెండు లక్ష్యాలతో జరిగిందని సీనియర్ ఐఏఎస్ ల మధ్య జరుగుతున్న చర్చపై వార్తలు ఇచ్చింది. రజత్ కుమార్ ను చీఫ్ సెక్రెటరీ రేసు నుంచి తప్పించటం, తెలంగాణలో 90 శాతం కాంట్రాక్టులను చేజిక్కించుకుని సమాంతర ప్రభుత్వం నడుపుతున్నమెగా కృష్ణారెడ్డిని బలహీనపర్చటంలో భాగంగానే ఈ వ్యవహారం బయటకొచ్చిందని ఐఏఎస్ లు మాట్లాడుకుంటున్న విషయాలను వివరించింది.
కేటీఆర్ ను ఆర్థికంగా, అధికారపరంగా బలమైన సీఎంగా నిలబెట్టాలనేది యువరాజు కోటరీ ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది. తొలివెలుగు ఈ కోణాల్లో కథనాలు రాసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఈ అంశంపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. రజత్ కుమార్ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ఏ పనులు పూర్తయ్యాయి.. ఎక్కడెక్కడ ఎంతెంత బిల్లులు చేశారనే పూర్తి వివరాలను ప్రభుత్వం తీసుకుంటోందట. నిజానికి ఈ వ్యవహారంపై ముందే ఫిర్యాదులు ఉన్నట్లుగా టాక్. కానీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే.. ఇప్పుడు ఇది బయటకు రావడం.. తొలివెలుగు వరుస కథనాలు ఇస్తుండడంతో కేసీఆర్ ఇంటెలిజెన్స్ కు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో నిఘా వర్గాలు పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ నుంచి కూడా పలు వివరాలు తీసుకుంటున్నారట. అలాగే మీడియా సంస్థల నుంచి ఆయా బిల్లులు ఇవ్వాలంటూ ఇంటెలిజెన్స్ పోలీసులు కోరుతున్నారని సమాచారం. ఇంకో రెండు రోజుల్లో ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.