కారు పార్టీలో ధిక్కార స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈటల ఎగరేసిన తిరుగుబాటు బావుటతో అసమ్మతి నేతలు తమ గళాన్ని విప్పడం మొదలుపెట్టారు. ఈటెలకు చెక్ పెట్టాలన్న కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టినట్టు అనిపిస్తుంది. ఆంధ్రప్రభ, మన తెలంగాణలో ఈటల మీద వ్రాయించిన వార్త పార్టీలో అసమ్మతి సెగను రాజేసినట్టు అయ్యింది.
హైదరాబాద్: కేబినెట్ విస్తరణలో ఈటెలను బయటకు పంపాలని భావించి కేసీఆర్ భంగపడ్డాడనిపిస్తుంది. పత్రికల్లో తనపై వచ్చిన వార్తలతో రగిలిపోయిన ఈటెల తన నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో పరోక్షంగా అధినాయకత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో ఖంగుతిన్న అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టి అదే రోజు రాత్రి పొద్దుపోయాక ఆయనతో ఒక ప్రకటన ఇప్పించారు. అయితే కేబినెట్ నుంచి మాత్రం సాగనంపలేకపోయారు. ఈ పరిణామాలతో ఈటెల తన శాఖ రివ్యూల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇది నచ్చని పని. అయినా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఒక మెట్టు దిగి రాష్ట్ర పర్యటనలో బిజీగా ఉన్న మంత్రి ఈటెలకు పోన్ చేసి విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ఎలా ఉన్నాయని వాకబు చేశారు. ఇటు వంటి సమయంలో ప్రజలకు చేరువుగా ఉండాలని సూచించారు. ఇది కేసీఆర్ సహజత్వానికి భిన్నంగా కనపడుతోంది. తనకు నచ్చని వారిని ఎవరినైనా పార్టీలో నుంచి సాగనంపాలని కేసీఆర్ ఒక్కసారి డిసైడ్ అయితే దానికి తిరుగు ఉండదు. పథకం ప్రకారం వాళ్లకు గుడ్‌బై చెబుతాడు. ఆలె నరేంద్ర, విజయశాంతి, ఇన్నయ్య, దేశం చిన్న మల్లయ్య, మృత్యుంజయ… ఇలా చాలా మంది పేర్లే మనకు గుర్తుకువస్తాయి.
ఈటెల విషయంలో ఎందుకో గురి తప్పినట్లు అనిపిస్తుంది. దీన్నే అదనుగా చూసుకొని అసమ్మతి నేతలు తమ స్వరాలకు పనిపెట్టారు. బహిరంగంగానే అధినాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీనీ వీడుతామంటూ పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వారిని బుజ్జగించి మళ్లీ వారితో అలాంటిదేమీ లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కిస్తున్నారు. ఆకోవాలోని వాళ్లే షకీల్, నాయిని, గాంధీ, రాజయ్య, జోగురామన్న, కడియం శ్రీహరి, బాజిరెడ్డి గోవర్థన్, జూపల్లి ఉన్నారు. దీనిని బట్టి పార్టీలో తీవ్రస్థాయిలోనే అసమ్మతి ఉన్నట్లు కనపడుతుంది. మరోవైపు ఎమ్మెల్యేలు, నాయకులపై, ,క్యాడర్ పై కేసీఆర్ పట్టుకోల్పోతున్నారా అన్న చర్చ ఇటు రాజకీయవర్గాల్లో, అటు గులాబీ క్యాంపులో జోరుగా సాగుతోంది. గులాబీ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. నివురుగప్పిన నిప్పులా ఉంది.