టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కేంద్రానికి దగ్గరయ్యే దారి దొరికిందా? కేసుల చిక్కుముడుల నుంచి చాకచక్యంగా తప్పించుకునే మార్గం కనిపించిందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ నుంచి ఏ లొల్లి లేకుండా ఉండేందుకు కేసీఆర్.. తన పాత రాజకీయ గురువైన చంద్రబాబునే ఫాలో కాబోతున్నరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి గట్టిన చంద్రబాబు.. ఊహించని విధంగా ఘోర పరాజయం పాలు కావడంతో ఆ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. మోదీ అండ్ కో కోపాన్ని చల్లార్చేందుకు తానే స్వయంగా తమ పార్టీ రాజ్యసభ ఎంపీలైన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపించారని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు అదే స్ట్రాటజీని కేసీఆర్ కూడా ఫాలో కాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తనకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త మైహోమ్ రామేశ్వరరావును కేసీఆర్ బీజేపీలోకి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారన్న చర్చ ఢిల్లీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వాస్తవానికి సీబీఐ, ఈడీ కేసుల భయంతో గతంలోనే బీజేపీలో చేరేందుకు మై హోం రామేశ్వరరావు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయంతో తీవ్రంగా ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. అయితే రామేశ్వరరావు పార్టీలో చేరేందుకు రావడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని.. ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా అంటూ కిషన్ రెడ్డికి హైకమాండ్ క్లాస్ కూడా తీసుకుందని.. అందుకే ఆయన చేరికకు బ్రేక్ పడిందని ఆప్పట్లో కథలు కథలుగా చెప్పుకున్నారు.
కాగా, మైం హోం రామేశ్వరరావు అవినీతిపై కేంద్రానికి ఇటీవల అనేక ఫిర్యాదులు వెళ్తుండటంతో ..మళ్లీ బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పైగా తనతో పాటు తన కుమారుడి మెడ చుట్టూ కూడా ఈ కేసులు చుట్టుకుంటుండటంతో ఎలాగైనా కమల దళపతులను కూల్ చేసుకునేందుకు రామేశ్వరరావు ఇటీవల పదే పదే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే చినజీయర్ స్వామి రామేశ్వరరావు తరపున మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరగుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో రామేశ్వరరావుకు న్యూస్ ఛానెల్స్ ఉండటంతో.. పార్టీకి ప్లస్‌గా మారుతుందని బీజేపీ అధిష్ఠానికి కిషన్ రెడ్డి వివరించడంతో …. ఢిల్లీ పెద్దలు రామేశ్వరరావు రాకపట్ల కొంత సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు మైం హోం రామేశ్వరరావు రాకను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. కేసీఆర్- మైహోం రామేశ్వరరావు మైత్రిని ఎండగడుతున్నందునే రాష్ట్రంలో బీజేపీకి ఎంతో మైలేజ్ వచ్చిందని.. అలాంటిది ఆయన్ను చేర్చుకుంటే తెలంగాణలో పార్టీపై విశ్వసనీయత లేకుండాపోతుందని హైకమాండ్‌కు వివరించినట్టుగా సమాచారం. ఫైనల్లీ కిషన్ రెడ్డి మధ్యవర్తిత్తవం ఫలిస్తుందా లేక.. మిగిలిన ఎంపీల అభ్యంతరం వర్కవుట్ అవుందా చూడాలి మరి.