అట్టహాసంగా మల్లన్నసాగర్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఇది మల్లన్నసాగర్ కాదు.. తెలంగాణ జలసాగర్ అంటూ అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. అయితే.. సరిగ్గా అదే టైమ్ లో ట్విట్టర్ లో కేసీఆర్ గో బ్యాక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది.
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల భూ నిర్వాసితులకు అందాల్సిన పరిహారం అందలేదు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం ఎప్పుడు చేస్తారని ట్విట్టర్ లో కేసీఆర్ ను ప్రశ్నిస్తూ ట్వీట్స్ చేశారు ప్రతిపక్ష నేతలు, ప్రజలు.
మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో 8 పంచాయతీల్లోని దాదాపు 6,533 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయడం కోసం ఒక్కో గ్రామానికి విడతలవారీగా పలు హామీలిస్తూ ప్రజలను తరలించారు. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించేటప్పుడు వారి ఆప్షన్ల మేరకు కొందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించగా.. మరికొందరికి ఓపెన్ ప్లాట్లను ఇవ్వడానికి హామీ ఇచ్చారు. దాదాపు ఏడాది కావస్తున్నా 3,500 కుటుంబాలకు అటు డబుల్ బెడ్రూం ఇండ్లను గానీ, ఇటు ఓపెన్ ప్లాట్లను గానీ ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ టూర్ ను వ్యతిరేకిస్తూ.. కేసీఆర్ గో బ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెట్టారు. దీంతో అది కాస్తా ట్రెండింగ్ లో నిలిచింది.
ఈ కన్నీళ్లు రేపు పెను ప్రళయంగా మారి #TRS ప్రభుత్వాన్ని ముంచేయబోతున్నవి. #KCRGoBack pic.twitter.com/WUYqZ0VX4L
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) February 23, 2022
నిజాల్ని తారుమారు చేసి ప్రజల కష్టార్జితంతో కొందరికే మేలు చేయడానికి కట్టిన ఈ ప్రాజెక్టు 14 గ్రామాల ప్రజల జీవితాల్లో చేసిన విలయతాండవాన్ని మాటల్లో చెప్పలేమంటూ ట్వీట్ చేశారు బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్. పుట్టిన గడ్డ మీదే ప్రజలను శరణార్థులుగా మార్చినాక ఇంక ఏ జాతి మిగిలిందని అంకితం చేయడానికి?.. మల్లన్న మిమ్మల్ని వదలడు.. బాధితుల కన్నీళ్లు రేపు పెను ప్రళయంగా మారి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ముంచేయబోతున్నాయని విమర్శించారు.