ఎదురే లేదన్నారు..! ఎదురు తిరుగుతుండ్రు..!! - Tolivelugu

ఎదురే లేదన్నారు..! ఎదురు తిరుగుతుండ్రు..!!

, ఎదురే లేదన్నారు..! ఎదురు తిరుగుతుండ్రు..!!విద్యా వెంకట్, జర్నలిస్ట్

మాది ఏకపక్షం.. మాకు ఎదురే లేదంటూ.. ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిలో నాయకులు గళం విప్పుతుండ్రు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్… అధికారంలోకి వచ్చాక తామే అసలుసిసలైన తెలంగాణ వాదులమని ఇతర పార్టీలపై బురదజల్లే ప్రయత్నం చేశారు.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి బూటకమని, అపవిత్ర కలయిక అని విమర్శలు చేసి రెండోసారి టీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ పార్టీలో సమ్మతి, అసమ్మతి అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే తెరాసలో ఎవరికి వారు వారి వాదాన్ని వినిపించడంతో గులాబీ తోటలో వేడి మొదలైందని చర్చ జరుగుతోంది.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉద్దేశించి పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్లు చేస్తూ… ఈటెల రాజేందర్ బలహీన వర్గానికి చెందిన నాయకుడని, ఆ కార్డుతోనే మంత్రి అయ్యారని అన్నారు.

ఈటెల రాజేందర్ తన నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఉద్వేగంగా ప్రసంగిస్తూ తాము ఉద్యమకారులమని, తామే గులాబీ పార్టీ ఓనర్లమని ప్రకటించారు. అయితే ఈటెల రాజేందర్ కామెంట్లను తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (కేటీఆర్) పరో క్షంగా తప్పుపడుతూ… మంత్రిపదవి రాగానే కొందరు పార్టీ కంటే తామే గొప్పోళ్ళ మని ఫీలవుతున్నారని అన్నారు. పార్టీ వల్లనే వారు పదవులు అనుభవిస్తున్నారని, ఆ విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజ్య సభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు … మంత్రి ఈటెల రాజేందర్ మాటల్లో తప్పులు వెతకడం సరికాదని అన్నారు. ఈటెల మాటల్లో తప్పు ఏమి ఉందని, తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టినోళ్లంతా పార్టీ ఓనర్లేనని ఈటెలను వెనకేసుకొచ్చారు.

పెద్దపల్లి పార్లమెంట్ మాజీ సభ్యులు బాల్క సుమన్, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫోటోలతో కూడిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కేసిఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే రాదు, కేసీఆర్ లేకుంటే బంగారు తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు, అసలు కేసిఆర్ లేకుంటే మేము ఎవరమూ లేము… అంటూ బాల్క సుమన్ కామెంట్ పెడితే …. దానికి కౌంటర్‌గా కేసిఆర్ లేకుంటే నా కొడుకు శ్రీకాంతచారితో పాటు 1200 మంది విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళు కాదు… అంటూ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నట్లు మీడియాలో వైరల్ అవుతున్నది.

ఇదిలా ఉండగా తాజాగా గద్వాల జోగులంబ జిల్లాలో నియంత పాలన పోవాలి.. హరీష్ రావు సీఎం కావాలి… అంటూ జోగులాంబ ఆలయంలో టిఆర్ఎస్ నాయకులు 1,116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. హరీష్ రావు సీఎం కావాలని వనపర్తి జిల్లా చందాపూర్ టిఆర్ఎస్ నాయకులు చింతకుంట విష్ణు మొక్కులు తీర్చుకున్నారు. ఉద్యమ సమయంలో హరీష్ రావు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, హరీష్ రావు ను కేటీఆర్ తొక్కేస్తున్నారని, ఆయన దమ్మున్న లీడర్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించాడని, ఆయన పేరు శిలాఫలకంపై లేదని ఆవేదన వ్యక్తంచేశారని అన్నారు. కేసిఆర్ పిట్టకథలు చెప్పేవాడని, హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతున్నారని అన్నారు. దీనికి సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో కూడా వార్తలు వచ్చాయి. తమకు ఎదురే లేదని, రెండో స్థానం కోసం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు తేల్చుకోవాలని ప్రకటించే తెరాస అధినేత ఆత్మవిమర్శ చేసుకోవాలని మేధావులు భావిస్తున్నారు. తెరాసలో జరిగే సమ్మతి అసమ్మతిని కాలమే నిర్ణయిస్తుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp