400 మంది పోలీసులతో రైతుల ఇండ్లపై దాడులు
వందల మంది రైతుల అక్రమ అరెస్టు.
వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు
పత్తా లేని ఎమ్మెల్యే బీరం
ఇదేనా అభివృద్ధి నమూనా
నమ్ముకున్నోడు నట్టేట్ల ముంచాడు..
మాకు దిక్కు ఎవరని విలపిస్తున్న రైతులు
హైదరాబాద్ : కుడికిల్ల గ్రామం ఇప్పుడు రణరంగాన్ని తలపోస్తోంది. సాగునీటి ప్రాజెక్టుకు భూములివ్వమని భీష్మించుకున్న రైతులపై స్థానిక ఎమ్మెల్యే పోలీస్ ఫోర్స్ ప్రయోగించి పొలాల నుంచి తరుముకుంటూ వచ్చి పోలీస్‌స్టేషన్లకు తరలించి కేసులు పెట్టిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సీయం కేసీఆర్ మెప్పు కోసం..కాంట్రాక్టర్లతో చేసుకున్న చీకటి ఒప్పంద ఫలితమే ఈ పోలీసు చర్య అని రైతులు బోరుమంటున్నారు. ఇంతటీ ఘోరానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్వార్థ రాజకీయమే కారణమని, మా రక్తాన్ని కండ్ల చూసిన ‘బీరం’కు రాజకీయ సమాధి కడతామని హెచ్చరిస్తున్నారు.
అక్కడ ఏం జరుగుతోందంటే.. వరుసగా మూడు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న కుడికిల్ల రైతులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువకు భూములు ఇవ్వడానికి నిరాకరించారు. 123 జీవో ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి. లేదా మల్లన్నసాగర్ దగ్గర ఇచ్చిన నష్ట పరిహారం ఇవ్వండి. కనీసం, భూమికి భూమిని ఇస్తే మేము అంగీకరిస్తామని మొదటి నుంచి రైతుల వాదన. ఇప్పటి ఎమ్మెల్యే ఆనాడు రైతుల తరుపున ఉద్యమించారు కూడా. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా వున్నప్పుడు ఈ ప్రాజెక్టు కట్టవద్దని మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేశాడు. రైతులను సమీకరించి ఉద్యమాలు చేశాడు. ‘మీ తరపున నేను ఉన్నానని కేసులు వేయించాడు.. ఎన్నో ఆందోళనలు చేయించాడు.’ ఈ విషయం సీయం కేసీఆరే ఈ ప్రాజెక్టును సందర్శించినప్పుడు గుర్తుచేశారు కూడా.. ఎమ్మెల్యే ముందే ‘కొంతమంది దుర్మార్గులు కేసులు వేశారని’ విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ బేరం కుదిరిందో కానీ బీరం కాంగ్రెస్‌ను వదిలి అధికార పార్టీలోకి జంప్ చేశారని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు పీఎల్ఆర్ఐ ప్రాజెక్టుపై వేసిన కేసును వాపస్ చేసుకున్నఎమ్మెల్యే.. ఇప్పుడు అదే ప్రాజెక్టును వర ప్రదాయిని అంటున్నాడు. పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వానికి, ఇటు కాంట్రాక్టర్లకు సహకరిస్తూ నమ్ముకున్న భూనిర్వాసితులు నట్టేట్లో వదిలేశాడని దుయ్యబడుతున్నారు.
తమకు అండగా ఉన్నాడని అతనికి ఓటేశామని రైతులు అంటున్నారు. ‘ఏరు దాటినాక పోరా బోడి మల్లన్న’ అన్నట్లుగా కుడికిల్ల రైతుల పట్ల బీరన్న వ్యవహారం ఇప్పుడు బాహటంగా బట్టబయలు చేస్తోందని దుయ్యబడుతున్నారు. పదవి వ్యామోహం, ధన వ్యామోహం ఎమ్మెల్యేని ఎంతవరకైనా తీసుకుపోతోందని, ఇప్పుడు రైతుల రక్తం చూసే స్థాయికి దిగజారిపోయాడని మండిపడుతున్నారు. రైతుల పక్షాన ఉండి పోరాడవలసిన ఎమ్మెల్యే బీరం విచక్షణ రహితంగా దాడులు చేసి రైతుల్ని పొలాల్లో నుంచి తరిమితరిమి అరెస్టులు చేస్తుంటే ఏం చేస్తున్నారని స్థానికులు ఫైరవుతున్నారు. చివరికి రైతుల్ని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుంటే కొల్లాపూర్‌లోనే ఉండీ కూడా పోలీసులను నిలువరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సర్వ సభ్య సమావేశానికి వచ్చి కనీసం రైతులను పరామర్శించలేదని తిడుతున్నారు. గతంలో కరెంట్ బిల్లు చెల్లించలేదని రైతులపై విద్యుత్ అధికారులు దాడులు చేస్తే అప్పటి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుపై తిరుగుబాటు చేసి రైతుల పక్షాన 15 రోజులు జైలు కెళ్లిన సంఘటన గుర్తుచేసుకుంటున్నారు ప్రజలు.
గతంలో ఈ విధమైన దాడులు ఏనాడు జరగలేదనేది రైతులు చెబుతున్నారు. కెఎల్ఐ, బీమా కెనాల్, భగీరథ, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు వేల ఎకరాలు రైతులను ఒప్పించి జూపల్లి కృష్ణారావు భూ సేకరణ చేశాడే కాని.. ఇలా అధికార బలాన్ని, పోలీసు ఫోర్స్‌ను ఉపయోగించలేదని గుర్తుచేసుకుంటున్నారు.