తెలంగాణ శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉపాధి పొందేవరకు నిరుద్యోగ భృతిని ఇస్తామని హమీ ఇచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా.. నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. గత బడ్జెట్ లో నిధులు కేటాయింపులకే పరిమితమైందని.. ఖర్చు చేయలేదన్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో పూర్తిగా నిధులు కేటాయించకుండా యువతని మరోసారి మోసం చేసిందన్నారు.
రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ లో సుమారు 28 లక్షల 40 వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారంతా ఉద్యోగాల కోసం ఎదురుచుస్తున్నారని ఉపాధి కల్పించేంతవరకు భృతి ఇవ్వాల్సిన ప్రభుత్వం.. ఇవ్వకుండా నిరుద్యోగ యువతని మోసం చేస్తుందన్నారు. అదేవిధంగా క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. ప్రతి మండలానికి మినీ స్టేడియంలను ఏర్పాటు చేస్తామని చెప్పి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని అన్నారు. విద్యా, వైద్యా రంగాలకు నామమాత్రపు నిధులు కేటాయించారని విమర్శించారు కోట రమేష్, ఆనగంటి రమేష్ లు.
కాగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు సంతృప్తికరంగా లేవని టీఎస్ యూటీఎఫ్ అభిప్రాయపడింది. గత ఏడాదితో పోల్చితే కేవలం (2022-23లో రూ.16,043 కోట్లు, ఈ సంవత్సరం రూ.19,093 కోట్లు) రూ.3000 కోట్లు అదనంగా పెంచారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయటానికి ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవన్నారు. ఇంగ్లీషు మీడియం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులు, మౌలిక వసతుల కల్పన కోసం కేటాయింపులు లేవన్నారు. మన ఊరు – మన బడి పథకాన్ని గత బడ్జెట్ లో ప్రకటించారు. గత సంవత్సరం 3497.62 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఇప్పటివరకూ 10% కూడా విడుదల చేయలేదన్నారు. కేవలం 684 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పాఠశాలలు పూర్తి చేయాలి.
ఈ సంవత్సరం పథకం అమలుకు అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రస్తావన లేదన్నారు. నూతన జిల్లాలకు డీఈఓలు, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టుల కేటాయింపు గురించి కూడా ప్రస్తావన లేదు. కేవలం 1000 గురుకులాల ద్వారా ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే సరిపోదన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటే బడ్జెట్ లో కనీసం 20%
విద్యకు కేటాయించాలని టీఎస్ యూటీఎఫ్ కోరుతుందన్నారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విధి విధానాలను, చందా ఎంతనేది ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్, మోడల్ స్కూల్, గురుకులాలు, కేజీబీవీ తదితర ఉద్యోగులందరినీ ఆరోగ్య పథకంలో చేర్చాలని కోరుతున్నామన్నారు. గత ఆరు నెలలుగా ఉద్యోగుల బకాయిలు, జీపీఎఫ్, సప్లిమెంటరీ బిల్లులు చెల్లించటం లేదు. వీటికి సంబంధించిన ప్రస్తావన కూడా బడ్జెట్ ప్రసంగంలో లేదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే ఉద్యోగుల బకాయిలు అన్నింటినీ క్లియర్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరారు.