తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పైన పటారం లోన లోటారం అన్నట్లు గా ఉందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. కేసీఆర్ దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం వడ్డీలకే సరిపోతుందని అన్నారు. 16 వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4.50 లక్షల కోట్లు అప్పుల మయంగా కేసీఆర్ మార్చేశారని ఆరోపించారు. దొర చేసిన అప్పులకు ఎనిమిదిన్నర ఏళ్లలో లక్ష కోట్ల వడ్డీలు కట్టారని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
ఇంత అప్పు చేసినా జనానికి ఒరిగింది మాత్రం సున్నా అని షర్మిల అన్నారు. ఆరోగ్య శ్రీ కి డబ్బుల్లేవ్..ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసల్ లేవ్.. ఏ పథకానికి నిధుల్లేవ్.. ఆఖరికి ఉద్యోగుల జీతాలకు కూడా అతీగతీ లేదన్నారు.తిన్నది కల్లకుంట్ల కుటుంబం.. కట్టేది తెలంగాణ జనం అని విమర్శించారు ఆమె. మీరు చేసిన దానికి ప్రజలు ఎందుకు వడ్డీలు కట్టాలి.. అని షర్మిల మండిపడ్డారు. ధనిక రాష్ట్రం అంటూనే జనాలను కేసీఆర్ జలగల్లా పీల్చుకొని తింటున్నారని మండిపడ్డారు.
చక్రవడ్డీలతో చక్రం తిప్పి, ఒక్కో నెత్తిన లక్షన్నర అప్పు పెట్టి..రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారన్నారు.బంగారు తెలంగాణ చేశానని, ఇక బంగారు భారత్ చేస్తానంటూ దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ బయల్దేరారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా ముందుగా తెలంగాణ ప్రజలను పట్టించుకోవాలని హితవు పలికారు.