సిద్దిపేట జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న సిద్దిపేటకు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. డైనమిక్ సిటీగా సిద్దిపేట అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. అయితే కేసీఆర్ తాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
హైదరాబాద్ నగరానికి నాలుగు దిక్కులా ఎయిర్ పోర్ట్ లు తీసుకొస్తామని గతంలో ఓసారి ప్రకటించారు. దానికి అతీగతీ లేదు. అలాగే వరంగల్ కు కూడా ఎయిర్ పోర్ట్ అని అన్నారు. వీటితోపాటు కొత్తగూడెం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనలు కూడా ముందుకు సాగలేదు. కానీ ఉన్నట్టుండి సిద్ధిపేటలో అంతర్జాతీయ విమానాశ్రయం అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కాగా సిద్ధిపేట పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో కేసీఆర్ పాల్గొన్నారు