రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. రాచరికపు లక్షణాలు మాత్రం అలానే కనిపిస్తున్నాయి! యాదాద్రిలో పునర్ నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయపు శిలలపై కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ కారు, పథకాల గుర్తులు చెక్కినట్టుగా వస్తున్న వార్తలు కలకలం సృష్టించాయి.
యాదాద్రి : తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. లక్ష్మీనరసింహస్వామి కొలువైన ఈ దివ్యక్షేత్రం తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మహా అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. ఆలయాన్ని అద్భుత శిల్పకళానైపుణ్యంతో, సకల శోభితంగా తీర్చిదిద్ది భక్తిదామంగా మలచే పనులు చేపట్టారు. అంతా బాగానే ఉంది. కానీ, యాదగిరిగుట్ట ఆలయ ప్రాకారంలో అలనాటి రాజుల మాదిరిగా కేసీఆర్ తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు విస్తుగొలుపుతోంది. గతంలో రాజులు ఆలయాలు నిర్మించి తమ వంశ చరిత్ర ముద్ర ఏదైనా అక్కడొక శిలాఫలకంపై ముద్రించే ఆనవాయితీ ఉండేది. అదే ఆనవాయితీగా కేసీఆర్ యాదాద్రిలో ఫాలో అవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
ఆలయంలోకి ఎంటర్ కాగానే అష్టభుజి ప్రాకార మండపం రాతి స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, పార్టీ గుర్తు కారు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు వరుసగా కేసీఆర్ కిట్, హరితహారం కనిపిస్తున్నాయి. ఇదేమి చోద్యం…! నారసింహుడి లీలలు కనిపించాలి కానీ…ఇలా కేసీఆర్ లీలలా..!!
కేసీఆర్ రాజులా ఫీలవుతున్నారేమో…! ఇది ప్రజాస్వామ్యం…! ఇలా పార్టీల సొంత ముద్రలు వేసుకోవడమే దౌర్భాగ్యం..! ఇది దైవ ద్రోహం. గతంలో గుడి ప్రాకారాలపై ప్రచార రాతలు రాసిన పార్టీలు…నేతలు ఫలితం అనుభవించాయి. ఇది అభినవ తెలంగాణా రాజు కేసీఆర్‌కు గుర్తు లేదేమో..! మరి..! అని జనం మాట్లాడుకుంటున్నారు.
దీనిపై భారతీయ జనతా పార్టీ వెంటనే స్పందించింది. ‘గుడి నీ అబ్బ సొత్తు కాదు కేసీఆర్..’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇది కేసీఆర్‌కు తెలిసి జరిగిందా లేక తెలియకుండా చేశారా అన్నది తేల్చాలని అన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణం ప్రభుత్వ సొమ్ముతో చేస్తున్నారని… టీఆర్ఎస్ సొమ్ముతో కాదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఈ రకంగా ఎవరూ చేయలేదని రాజాసింగ్ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని… వెంటనే ఆలయంలోని కేసీఆర్ సహా పలు ప్రతిమలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఆ పని చేయకపోతే… తాము ప్రజలతో వచ్చి వాటిని తొలగిస్తామని డిమాండ్ చేశారు.
గుడిలో అమర్చినట్టుగా చెబుతున్న బొమ్మలు ఇలావున్నాయి.