తాను పెట్టిన గడువును ఆర్టీసీ కార్మికులు బేఖాతరు చేయడంతో గడువు ముగిసే సమయానికి పట్టుమని మూడు వందలమంది కూడా విధులలో చేరలేదు. ఇది కేసీఅర్ ఇమేజ్ కి డ్యామేజ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతంగా నడిపి సబ్భండవర్గాలను ఏకంచేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడుగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న నాయకుడి గా ఉంటూ, సీఎం హోదాలో ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ పెట్టి విధులలో చేరమని ఆదేశిస్తే… కార్మికులు లెక్కచేయకుండా పోవడం దేనికి నిదర్శనం….?
కేసీఆర్ ప్రభ తగ్గుతుందా… ప్రజలలో ఆయన పట్ల ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందా… భ్రమలు తొలుగుతున్నయా… ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో చెప్పిన మాటలకు, సీఎం అయ్యాక అనుసరిస్తున్న విధానాలకు పొంతన లేకపోవడం. అందులోనూ రెండో సారి అధికారంలోకి వచ్చాక నాకు ఎదురులేదు అన్న ధోరణితో వ్యవహరించడంతో ప్రజలలో ఆగ్రహానికి కారణంగా కనపడుతుంది అంటున్నారు విశ్లేషకులు.
అయితే ఉప ఎన్నికలో, స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ గెలవడంతో మాకు తిరుగులేదని, ప్రజలు మాతోనే ఉన్నారనే అహంకారం వచ్చింది అంటున్నారు. ఇది శాశ్వితం కాదని గుర్తు చేస్తూ… గతంలో చాలా ప్రభుత్వాలను చూశామని ,అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడం సర్వసాధారణం అంటున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ప్రతి ఎన్నికలలో గెలుపు మాదే అనుకోవడం పొరపాటు అని విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నికలకు జనరల్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసీఅర్ ఇమేజ్ మసకబారడం ఖాయంగా కనపడుతోంది. ఆర్టీసీ కార్మికులు చూపిన పోరు బాట అందరికీ మార్గదర్శకం అవుతుందని చెప్పుకొస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు, టీచర్స్ సంఘాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇలా ఒకరి వెంట ఒకరు పోరు దారి పట్టడం ఖాయం అంటున్నారు. ఇదే జరిగితే కేసీఅర్ కి కష్టాలు తప్పవంటున్నారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా రాష్ట్రంలో పాగా వేసేందుకు వ్యూహం రచిస్తోంది. అందులో భాగమే ఆర్టీసీ సమ్మెను భూజనికి ఎత్తుకుంది. నిన్నటిదాకా ఉన్న గవర్నర్ నరసింహన్ కేసీఆర్ కి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన గవర్నర్ నరసింహన్ లాగ కేసీఅర్ కు సహకరించడం కష్టం. ఫస్ట్ టర్మ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి నట్లుగా సెకండ్ టర్మ్ లో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అని అర్థం అవుతుంది. ఇది కూడా కేసీఆర్ కు కష్టాలు తెపించ్చే విషయమే. ఇలా ఒకదానికి ఒకటి తోడుఅవుతున్నాయి. ఫస్ట్ టర్మ్ నల్లేరు మీద నడకలా పాలన సాగినా… సెకండ్ టర్మ్ అలా సాగే అవకాశాలు కనపడటంలేదు. అందుకు ఎంపీ ఎన్నికల ఫలితాలు, టీచర్స్, గ్రాడ్యువేటు ఎన్నికల ఫలితాలు… ఆర్టీసీ సమ్మె ఇలా అనేక ప్రతికూల పరిస్థితులు కనపడుతున్నాయి. భవిష్యత్ లో ఈ పరిణామాలు ఇంకా బలపడి, అన్ని వర్గాలు ఒకతాటి మీదికి వచ్చి, సామాజిక న్యాయం డిమాండ్ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రెండో సారి కేసీఅర్ అధికారంలోకి వచ్చాక తన సామాజిక వర్గానికి కీలక పదవులు కట్టబెడుతుండటంతో… బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి వర్గంలో తమకు అన్యాయం జరిగింది అని మాదిగలు ఇప్పటికే కేసీఆర్ మీద తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సామాజిక న్యాయం డిమాండ్ పై ఉద్యమం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం.