సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ టీఆర్ఎస్‌లో ఉన్న విచిత్ర పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ రాజకీయ వ్యూహాన్ని కలవరపెడుతున్నట్లు కనపడుతోంది. సీఎం కేసీఆర్ వర్గం నేతలు ఒక పక్క, కేటీఆర్ సన్నిహిత నేతలు ఒక పక్క ఒత్తిడి తెస్తుండటంతో… సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.
తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కూడా. టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కే కేశవరావు పదవీ కాలం ముగియబోతుంది. దీంతో కేకేకు మరోసారి అవకాశం ఉంటుందా అన్న చర్చ జోరందుకుంది. కానీ ఆర్‌టీసీ ఉద్యమం అనంతరం కేసీఆర్ కేకేను కాస్త దూరం పెడుతున్నారని టీఆరెఎస్ వర్గాలంటున్నాయి. దీంతో మరోసారి ఆయనకు అవకాశం ఉంటుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇక రెండో బెర్త్ కోసం పోటీ మరింత ఎక్కువగా ఉంది. మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కవితతో పాటు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ సీనీయర్ నేత విఠల్‌తో పాటు పలువురు పారిశ్రామికవెత్తలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అనేక మంది కొత్త నేతలు తెరపైకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై పోటీ చేశారు. దీంతో ఈ సారి కూడా ఒక స్థానానికి అలాంటి పరిస్థితే ఉంటుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.
ఈసారి రాజ్యసభకు కవితను పంపకపోతే… రాబోయే రోజుల్లో మండలికి పంపి, ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇక మాజీ ఎంపీ పొంగులేటి కోసం ఏపీ సీఎం జగన్ కేసీఆర్‌తో మాట్లాడినట్లు టీఆర్ఎస్‌లో ప్రచారం సాగుతోంది.
అయితే, రాజ్యసభ సభ్యుల ఎంపిక బట్టి… అవకాశం ఇవ్వలేని నేతలకు గవర్నర్ కోటాలో ఖాళీ కాబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పించేందుకు టీఆర్ఎస్ అధినాయకత్వం మొగ్గుచూపుతున్నా, అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి ముందు నుండి దన్నుగా నిలిచిన నేతల పదవి కాలమే పూర్తవుతుండటంతో… టీఆర్ఎస్‌లో పదవుల అంశం చర్చనీయాంశం అవుతోంది.