కారు ఓవర్ లోడ్ - Tolivelugu

కారు ఓవర్ లోడ్

కారు ఓవర్ లోడ్ అయ్యింది. దించటమా, దిగడమా అనేది తేలాల్సి ఉంది. దిగే వాళ్లు ఉంటే దిగనిస్తే మంచిది అన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరెవరు ఎప్పుడు దిగుతారో, ఎవరెవరిని ఎప్పడు అధిష్టానమే దించుతుందో వేచి చూడాలి. ఇప్పటికే కొందరు తమ అసమ్మతిని బహిరంగంగానే వినిపిస్తున్నారు. మరికొందరు తమ సన్నిహితుల దగ్గర  అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. బహిరంగంగా అసమ్మతిని వినిపించే నాయకుల విషయంలో అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు సందర్భాన్ని బట్టి వారిని వదిలించుకొనేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

kcr shockహైదరాబాద్ : సిట్టింగ్ ఎమ్మెల్యేలను మాత్రం కారు నుంచి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కారు దిగినా చూసి చూడనట్లు వదిలేసే ఆలోచనలో అధినాయకుడు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇఫ్పటికే చాలా నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులు ఉన్నాయి. వారి మధ్య ఉన్న విభేధాలు క్రమంగా తీవ్రరూపం దాల్చే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి….ఈ విభేధాలు భవిష్యత్తులో పెద్ద తలనొప్పిగా మారడమే ఖాయం. వీటిని సరిచేయడం పార్టీ అధినాయకుడికి పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. వీరి మధ్య ఐక్యత తేవడం సాధ్యంకాదు. అలాగే వీరికి ప్రత్యామ్నాయంగా పదువుల కట్టపెట్టి సర్థిచెప్పే పరిస్థితి కూడా లేకపోవడంతో కొందరిని వదిలించుకోవడమే సరైన పరిష్కారం అని గులాబీ అధినేత భావిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది.

ఇటీవల పార్టీలో చేర్చుకున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో పూర్తి అధికారం కట్టబెట్టడంతో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులు గుర్రుగా ఉన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కమిటీల నియామకాల్లో వీరికి కనీస ప్రాధాన్యం కూడా లేకుండా పోయింది. చివరికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు కూడా పార్టీ సభ్యత్వం దక్కని పరిస్థితి. వాళ్ల అనచరవర్గం సంగతి ఇక సరే సరి. పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఆన్ లైన్ లో తీసుకోవాల్సిన దుస్థితి. తమకు అంత ఖర్మ పట్టలేదని తమ అనచరుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నారు.దీంతో చాలా నియోజకవర్గాల్లో పాత క్యాడర్ కు సభ్యత్వం దక్కలేదు.ఈ విషయం అధిష్టానంకు తెలిసినా నిమ్మకు నీరెత్తి ఉండడం దేనికి సంకేతం. దీని బట్టి ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వారిని వదిలించుకునే పనిలో అధిష్టానం ఉందా అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతుంది.

రాష్ట్రంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ నాయకులు అసంతృప్తితో ఉన్నారో వారి సమాచారం తెప్పించుకునే పనిలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. వీరితో చర్చించేందుకు రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా జాతీయ నాయకత్వం కొందరిని నియమించినట్టు తెలుస్తోంది. సమయం, సందర్భాన్ని బట్టి వారిని పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది. ఇది ఇలా ఉంటే నిన్నటి వరకు హరీష్‌ను పక్కనపెట్టడం. ఈటెల బహిరంగంగానే తన అసమ్మతిని వెళ్లగక్కడం దానికి తోడు నిన్నటిదాకా లోలోన అసమ్మతితో రగిలిపోయిన నాయిని లాంటివారు మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో ఉన్నవారు నేడు బహిరంగంగానే అధినాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాలు బీజేపీకీ కలిసొచ్చాయి.అయితే బీజేపీ ప్రమాదాన్ని గులాబీ అధినాయకత్వం గుర్తించినా… కారు ఓవ‌ర్‌లోడ్ కావడంతో కొందరిని దించకతప్పని పరిస్థితి. మరోవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ..కేంద్ర నాయకత్వంపై దూకుడుగా వెళ్లేందుకు టీఆర్ఎస్ అధినాయకత్వం వెనకా ముందవుతోంది. బీజేపీనీ చూసి మా బాస్ ఎందుకు భయబపడుతున్నాడో అర్థం కావడం లేదని గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. యువ నాయకుడు కొంత దూకుడుగా ఉన్నా, అధినాయకుడు మాత్రం పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లేదు. ఈ పరిస్థితులను చూస్తుంటే టీఆర్ఎస్‌కు కష్ట కాలం వచ్చిందని చెప్పకతప్పదు.

Share on facebook
Share on twitter
Share on whatsapp