– శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కేసీఆర్ కు అనేక షాకులు
– హుజూరాబాద్ లో పరాభవం
– వర్కవుట్ కాని.. దళిత బంధు
– ఎత్తేసిన ధర్నాచౌక్ లోనే నిరసన.. పోయిన పరువు
– నమ్మకం లేదంటున్న నిరుద్యోగులు, రైతులు
– పీకే హ్యాండివ్వడంతో అయోమయం!
– భవిష్యత్తును తలుచుకుని భయం భయం
తెలుగు సంవత్సరాది ఉగాది అంటే అందరూ సంతోషంగా ఉంటారు. సంబరాలు చేసుకుంటారు. కానీ.. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మాత్రం భయంతో కూడిన సంతోషంలో ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. అదెలా అంటారా? శ్రీ ప్లవ నామ సంవత్సరం ఆయనకు తగిలిన షాకులు అలాంటివి మరి. ఇప్పుడు శుభకృత్ నామ సంవత్సరంలో ఎలా ఉంటుందనే టెన్షన్ లోనే కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. గతేడాది ఆయన ఏది అనుకున్నా రివర్సే అయింది.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కేసీఆర్ కు అతిపెద్ద షాకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికే. కేబినెట్ లో ఉన్న అధిక శాతం మంత్రులపై కబ్జాలు, అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. కానీ.. కంట్లో నలుసులా మారిన ఈటల రాజేందరే కేసీఆర్ కు టార్గెట్ అయ్యారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తోనే ఉంటూ ఆయన స్థాయిలోనే ప్రజల హృదయాల్లోకి వెళ్లారు రాజేందర్. ముఖ్యంగా కరోనా సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. కానీ.. ఈటల మాత్రం.. రాష్ట్రంలోని ఆస్పత్రులను తిరుగుతూ.. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆ సమయంలో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
సీన్ కట్ చేస్తే.. కొన్నాళ్లకు అవినీతి ఆరోపణలు రావడం.. బర్తరఫ్ చేయడం.. ఈటల పార్టీని వీడడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటలను ఓడించాలనే పంతంతో అధికారికంగా, అనధికారికంగా కోట్లు కుమ్మరించారు. కానీ.. జనాలు గులాబీ పార్టీ గూబ గుయ్ అనేలా తర్పునిచ్చారు. ఈటలకే జై కొట్టారు. తనను ఓడించాలని దాదాపు రూ.500 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ఇప్పటికీ ఈటల చెబుతుంటారు. హుజూరాబాద్ ధన ప్రవాహం.. తర్వాతి ఎన్నికలపైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందని.. అభ్యర్థులకు చుక్కలు కనపడడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇక హుజూరాబాద్ ఎన్నిక సమయంలోనే కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం.. ఆయన గ్రాఫ్ ను అమాంతం కిందకు దిగజారిపోయేలా చేసిందని అంటున్నారు. దళిత ఓట్లు అధికంగా ఉన్న హుజూరాబాద్ కు ఉపఎన్నిక సమయంలోనే ఈ పథకాన్ని తీసుకురావడం.. అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తుండడం దళితుల పట్ల కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతోందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొందరికి సాయం చేసి.. దాంతో లాభపడాలనే ప్లాన్ లో ఉన్నారని అంచనా వేస్తున్నారు.
అసలు.. రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. గోదావరి నీళ్లు తీసుకొచ్చామని గర్వంగా చెప్పుకుంటున్న కేసీఆర్.. రైతుల్ని వరి పంట వేయొద్దని చెప్పడం పెద్ద మైనస్ అయింది. పైగా కేంద్రంపై నెపం నెట్టేసి తాను ఎత్తేసిన ధర్నాచౌక్ లోనే నిరసనకు దిగి పరువు పోగొట్టుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇలా ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కు తగిలిన షాకులు చాలానే ఉన్నాయి. 8 ఏళ్ల నుంచి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏనాడూ కేసీఆర్ వారి గురించి మాట్లాడింది లేదు. సడెన్ గా ఈ మధ్య నిరుద్యోగులు గుర్తుకొచ్చి 80వేల ఉద్యోగాలే ఉన్నాయని ఏవేవో లెక్కలు చెప్పి నోటిఫికేషన్లు వెంటనే వస్తాయని ప్రకటించారు. అన్ని ఉద్యోగాలు ఒకేసారి ప్రకటించాం కాబట్టి.. నిరుద్యోగుల కోపం చల్లారుతుందని కేసీఆర్ భావించారు. కానీ.. ఆయన ప్రకటన వెలువడిన తర్వాత నిరుద్యోగులు సంబరాలు చేసుకున్న సందర్భాలు ఏవీ పెద్దగా కనిపించలేదని చెబుతున్నారు విశ్లేషకులు. కేసీఆర్ పై వారిని ఉన్న నమ్మకం అలాంటిదని గుర్తు చేస్తున్నారు.
ఇక కేసీఆర్ కు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అసలు సిసలైన షాక్ ఏదైనా ఉందంటే అది పీకే హ్యాండివ్వడమే. మూడోసారి గెలుపుగుర్రం ఎక్కాలని ప్రశాంత్ కిశోర్ ని తీసుకొచ్చుకున్నారు. తమది ఏడెనిమిదేళ్ల బంధం అంటూ ఏదేదో చెప్పారు. తీరా చూస్తే పీకే హైదరాబాద్ లో టెంట్ పీకేసి.. ఢిల్లీకి మకాం మార్చారు. వచ్చే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పని చేసేందుకు సిద్ధం అయ్యారని చెబుతున్నారు రాజకీయ పండితులు. ఈసారి టీఆర్ఎస్ గెలుపు అవకాశాలపై అనేక సర్వేలు చేసిన పీకే టీమ్.. ఏం చేసినా కేసీఆర్ తో కుదిరే పని కాదని భావించి వెళ్లిపోయి ఉంటాడని అంచనా వేస్తున్నారు.
నిజానికి పీకే అండ చూసుకుని కేసీఆర్ జాతీయ రాజీకీయాల మంత్రం జపించారు. ఏ పార్టీ నాయకుడు పట్టించుకోకపోవడంతో గప్ చుప్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని భావించి కేంద్రాన్ని నానా మాటలు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని గులాబీల చేత తిట్టిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం క్లారిటీగా చెబుతున్నా.. కేసీఆర్ మాత్రం రాజకీయం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి.. కేంద్రం వంట గ్యాస్, పెట్రోల్ పెంచేస్తోందని ధర్నాలకు దిగడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న వినిపిస్తోంది. కేంద్రానికి వర్తించేదే కేసీఆర్ కు వర్తిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే మహిళా గవర్నర్ తమిళిసై విషయంలో సీఎం వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు విశ్లేషకులు. పదే పదే ఆమెను అవమానించడం టీఆర్ఎస్ పై మహిళల్లో వ్యతిరేకతకు కారణం అవుతోందని అంటున్నారు. ఇలా శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనేక షాకులకు గురైన కేసీఆర్.. ఇప్పుడు శుభకృత్ నామ సంవత్సరంలో ఏం జరుగబోతోందనే భయంలో ఉన్నారని చెబుతున్నారు విశ్లేషకులు.