– పీకే ఇంటర్వ్యూపై రాజకీయవర్గాల్లో చర్చ
– కాంగ్రెస్ కు కేసీఆర్ ఆర్థిక సాయం?
– ప్లాన్ వర్కవుట్ అయితే బీజేపీకి షాకే!
– కేసీఆర్ ను నిలువరించే పనిలో బీజేపీ పెద్దలు!
– ప్రభుత్వ అవినీతిపై దృష్టి?
– కేసీఆర్ కు చెక్ పెట్టేలా పక్కా ప్లానింగ్!
ప్రస్తుతం కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా? ఏది చేపట్టినా బూమరాంగ్ అవుతోందా..? సారు వ్యూహాలేవీ పారడం లేదా..? రాజకీయాల్లో చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ కు.. ఆఖరికి ఆయన వ్యూహాలపై ఆయనకే నమ్మకం సన్నగిల్లిందా? అంటే అవుననే అభిప్రాయం రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపడం.. ఆయన డైరెక్షన్ లో కేసీఆర్ ముందుకెళ్తుండడం చూసి అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. పీకే ప్లానింగ్ తో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఓ నేషనల్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీని ఓడించడం కష్టం కాదు.. అలాగని కాంగ్రెస్ ను కాదని బీజేపీని ఓడించడం కూడా కష్టమని అన్నారు. దీనిపై రాజకీయ పరిశీలకులు అనేక కోణాలలో విశ్లేషణ చేస్తున్నారు.
200 లోక్ సభ స్థానాలలో బీజేపీ.. కాంగ్రెస్ ముఖాముఖీగా తలపడుతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకొని బరిలోకి దిగితే అధికారంలోకి రాకుండా నిలువరించవచ్చు అని పీకే చెప్పడం వెనుక వ్యూహం ఏంటో అర్థం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు. బెంగాల్ సహా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలహీనంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ మిత్రపక్షాలు అక్కడ బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ డైరక్షన్ లో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. పీకే తన ఇంటర్వ్యూ లో నర్మగర్భంగా ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనే రాజకీయ శక్తి కాంగ్రెస్ కు ఉంది కాబట్టి దానిని కాదని ఓడించడం కష్టం. అదే సమయంలో కాంగ్రెస్ ఆర్థికంగా బలహీనంగా ఉంది. ఆ పార్టీకి ఆర్థిక సహాయం అదించగలిగితే.. 200 లోక్ సభ స్థానాలలో బీజేపీతో ముఖాముఖిగా పోటీ పడుతున్న కాంగ్రెస్ తో… ఆయా రాష్ట్రాలలో ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలతో వ్యూహాత్మక సీట్ల ఒప్పందం కుదుర్చుకోగలిగితే మూడోసారి బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చు అనేది పీకే వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఈ పని కేసీఆర్ చేయగలరని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఓవైపు బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య జరుగుతున్న యుద్ధం రియలా? రీలా? అనే అనుమానం రాజకీయ వర్గాలలో బలంగా ఉంది. అయితే… ఉత్తరప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలలో మార్పులు రావొచ్చనే నేపథ్యంలో పీకే ఇచ్చిన ఇంటర్వ్యూకు ప్రాధాన్యత ఏర్పడిందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని అనుకుంటున్న కేసీఆర్ కు ఒక్కో లోక్ సభ స్థానానికి రూ.30 కోట్ల చొప్పున 200 స్థానాలకు నిధులు సమకూర్చడం పెద్ద కష్టం కాదని కూడా అంటున్నారు. కేసీఆర్ దృష్టిలో ఇది పెద్ద అమౌంట్ కాదనే భావన పీకేకు కూడా ఉండి ఉంటుందని చెబుతున్నారు. తనకే రూ.200 కోట్లు ఇచ్చి వ్యూహకర్తగా పెట్టుకున్న కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి ఈ మొత్తాన్ని సమకూర్చడం పెద్ద సమస్య కాదనే ఆలోచనతోనే పీకే ఆ ఇంటర్వ్యూ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ తో జాతీయ రాజకీయాలపై చర్చించాకే అలా మాట్లాడి ఉంటారనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కేసీఆర్ పై దూకుడు విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకుల వాదన. ముందుగా తెలంగాణలో సంస్థాగతంగా బలపడాలి. అంతర్గత నాయకత్వం మధ్య ఉన్న విభేదాలను, ఇతర సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. నేలవిడిచి సాము చేయడం వలన బీజేపీకి అసలుకే ఎసరు వస్తుందని చెబుతున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం నిధులు సమకూర్చడం కేసీఆర్ కు కష్టం కాదు. పీకే చెప్పిన వ్యూహం ప్రకారం చూస్తే బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడం కూడా పెద్ద కష్టం కాదని అర్థం అవుతోంది. ఇదే జరిగితే తెలంగాణలో అధికారంలోకి వచ్చే మాట దేవుడెరుగు.. జాతీయ స్ధాయిలో బీజేపీ అధికారం కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. అందుకే బీజేపీ నాయకత్వం కేసీఆర్ పై దూకుడు కన్నా.. సంస్థాగత నిర్మాణం, అంతర్గతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెడితే బెటర్ అని సూచిస్తున్నారు.
మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా అన్నీ నిశితంగా గమనిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు.. ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన దరఖాస్తులపై దృష్టి పెడుతున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. అప్పుడే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం కేసీఅర్ నిధులు సమకూర్చకుండా నిలువరించగలం అనే ఆలోచనలో బీజేపీ అగ్ర నాయకత్వం ఉందని విశ్లేషణ చేస్తున్నారు. లేకపోతే తెలంగాణలో అధికారంలోకి వచ్చే సంగతి ఎలా ఉన్నా కేంద్రంలో అధికారంలోకి రాకుండా పోయే ప్రమాదం ఉందని కూడా ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే తెలంగాణలో బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కనపడుతోందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.