రాహుల్ గాంధీ వస్తున్నారని తలుచుకుంటేనే సీఎం కేసీఆర్ కు వణుకుపుడుతోందని వ్యాఖ్యానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ ఓయూకు వస్తే సీఎంకు భయమెందుకని ప్రశ్నించారు. ఆయన పర్యటనకు సహకరిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. దీనికితోడు అరెస్ట్ అయిన వారిని కలిసేందుకు వెళితే జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోవడం ఏంటన్నారు.
అరెస్టులతో రాహుల్ పర్యటనను ఆపలేరని తేల్చి చెప్పారు. ఆదివారం జగ్గారెడ్డి ఓయూకు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నప్పుడే కేసీఆర్ మనస్తత్వం ఏంటో తెలంగాణ సమాజానికి అర్ధం అయిందన్నారు రేవంత్. కేసీఆర్ బానిసలు మాట్లాడే మాటలను తాను పట్టించుకోనని.. టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం వారిని చెప్పులతో కొట్టాలని అన్నారు. రబ్బరు చెప్పులు లేనోడు కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడేంత అయిండని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో? నియంత రాజ్యంలో ఉన్నామో? అర్ధం కావట్లేదన్నారు.
కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ సోనియాగాంధీ పెట్టిన బిక్ష అని సెటైర్లు వేశారు. కేసీఆర్ పిరికి పాలకుడని.. ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.