– దేశంలో బొగ్గు దిగుమతి అవసరమే లేదు
– కానీ, అదానీ కోసం చేస్తున్నారు
– మోడీకి అదానీపై ఉన్న ప్రేమ..
– దేశ ప్రజలపై లేదు
– విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం కానివ్వం
– కేంద్రం కుట్రలపై పోరాటం చేస్తాం
– తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తాం
– నాందేడ్ లో కేసీఆర్ ప్రెస్ మీట్
దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడం లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నాందేడ్ బహిరంగ సభ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే కేంద్రం దేశమంతా ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించారు. రైతులను విస్మరించి కేవలం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. వాటర్ పాలసీని మార్చడానికి ఎవరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదన్నారు. నీటి వినియోగంపై బీఆర్ఎస్ ఎజెండా విప్లవాత్మకంగా ఉంటుందని.. చిన్న దేశాలైన సింగపూర్, జపాన్, మలేషియా ఎంతో అభివృద్ధి చెందాయని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ అతి చిన్నదేశమైన జింబాబ్వేలో ఉందన్నారు. ఈజిప్టు, కొలంబియా, చైనా, అమెరికా వంటి దేశాల్లో భారీ రిజర్వాయర్లు ఉన్నాయని.. ఇంత పెద్ద భారతదేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో కొత్త వాటర్, కొత్త పవర్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు కేసీఆర్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్స్ పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. దాదాపు నాలుగు దశాబ్దాలు దాటినా దేశంలో నీటి సమస్య సమసిపోలేదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటని అసహనం వ్యక్తం చేశారు.
కేంద్రానికి అదానీపై ఉన్న ప్రేమ.. దేశ ప్రజలపై ఉండాలి కదా..? అని ప్రశ్నించారు కేసీఆర్. కిలో బొగ్గును కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని.. కానీ, అదానీ కోసం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయకూడదన్న సీఎం.. కేంద్రం అదానీ, అంబానీ, జిందాల్ పాట పాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డంగా అమ్మేస్తున్నారని.. అదానీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెను ముప్పుగా మారిందని.. ఇలాంటి కుట్రలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండేండ్లలోనే దేశంలో నిరంతర వెలుగులు తీసుకొస్తామని తెలిపారు కేసీఆర్. బొగ్గు గనులున్న అన్ని ప్రాంతాలకు రైల్వే లైన్లు వేస్తామన్న ఆయన.. దేశంలో 90 శాతం విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే ఉంచుతామన్నారు. న్యూయార్క్, లండన్ లో కరెంట్ పోయినా హైదరాబాద్ లో పోదని.. భాగ్యనగరాన్ని పవర్ హైల్యాండ్ గా మార్చామని స్పష్టం చేశారు.