మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కరీంనగర్ పద్మానగర్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ప్రారంభించారు.
ఇక కేసీఆర్ పాలసీలకు భిన్నంగా ఏం చేస్తారో చెప్పకుండా పాదయాత్రల్లో వ్యక్తిగత దూషణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయన్న మంత్రి.. వీళ్లంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించిన వ్యక్తులు, పార్టీలేనని ఆరోపించారు. కేసీఆర్ కంటే గొప్ప పాలకుడు వీరిలో ఎవరూ ప్రజలకు కన్పించడం లేదని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లకు ఇది అర్థం కాదని విమర్శించారు. చేతకాని నేతలు సభలు, పాదయాత్రలు చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు అది అర్థం కాదన్న ఆయన.. కేసీఆర్ కు మిగతా నేతలకు మధ్య ఉన్న విభజన రేఖను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
యాసంగి సాగులో ఆల్ టైం రికార్డు సాధించామన్న ఆయన.. 2014 లో 28 లక్షల ఎకరాల సాగు ఉంటే ఈ సారి 68 లక్షల పైగా యాసంగి సాగు జరిగిందని కొనియాడారు. వ్యవసాయ వృద్ధి రేటులో మనం దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామని.. ఇది సీఎం కేసీఆర్ విధానాల వల్లే సాధ్యమైందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.