ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మళ్లీ ఫైర్ అయ్యారు. విద్యుత్ ఇంజినీర్లకు రివర్షన్ గిఫ్ట్ ఇచ్చిన మూర్ఖుడు కేసీఆర్ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చెదెన్నడని ప్రశ్నించారు. ఏప్రిల్ 2022 నుంచి పెండింగ్ ఉన్న పీఆర్సీన కేసీఆర్ విడుదల చేయలేదని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగుల్ని కరివేపాకులా వాడుకొని వదిలేశారన్నారు.
కష్టపడి పనిచేసిన విద్యుత్ ఇంజనీర్లకు రివర్షన్ పేరిట రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులరైజ్ చేయకుండా ఆర్టిజన్ పేరుతో వంచించాడని ధ్వజమెత్తారు. అవినీతి, అశాస్త్రీయ నిర్ణయాలతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్ని నష్టాల ఊబిలోకి నెట్టేసిన ముఖ్యమంత్రి విద్యుత్ ఉద్యోగుల్ని రాచి రంపాన పెడుతున్నారన్నారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఏప్రిల్ 2022 నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీని ఇప్పటి దాకా ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ ఎప్పుడు వస్తుందా అని ఉద్యోగులు 9 నెలలుగా ఎదురుచూస్తున్నారన్నారు.
ఇక జీతాలు కూడా ఎప్పుడొస్తాయో తెలియక అయోమయంలో ఉన్నారన్నారు.గతంలో ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వచ్చేవని, ఇప్పుడు 10 వ తేదీ దాటితే కానీ జీతాలు రాని దుస్థతి ఏర్పడిందన్నారు. పైగా ఏసీడీ వసూలు చేసుకోండి, జీతాలు తీసుకోండి అని మౌఖికంగా చెప్పినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఏసీడీ బిల్లుల కోసం వెళ్లిన ఉద్యోగులపై జనం తిరగబడుతున్నారన్నారు. కేసీఆర్ చేసిన తప్పిదాలకు ఉద్యోగులు బలయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
విద్యుత్ శాఖలో కీలక స్థానాలను తెలంగాణేతర అధికారులే ఆక్రమిస్తున్నారని, న్యాయపరంగా రావాల్సిన ప్రమోషన్లు రాకుండా చేస్తున్నారని ఆనాడు పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్ మళ్లీ పాతరోజులకు పరిస్థితిని తీసుకెళ్లారని బండి విమర్శలు గుప్పించారు. సంస్థల్లోని కీలక పోస్టుల్లో తెలంగాణేతర ఆఫీసర్లే నియమించి తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఇంజినీర్లకు కేసీఆర్ రివర్షన్ గిఫ్ట్ ఇచ్చి ఉన్నత స్థానం నుంచి కింది స్థాయికి పంపించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్ దేనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.