– పాత గురువు బాటలోనే పయనం
– కేంద్రాన్ని టార్గెట్ చేయడంలో అదే స్ట్రాటజీ
– రాష్ట్ర రాజకీయాలపైనా సేమ్ ఫార్ములా!
– సారు స్ట్రాటజీలపై రాజకీయ పండితుల విశ్లేషణ
కేసీఆర్ ఎప్పుడేం చేస్తారో ఎవరూ అంచనా వేయలేరని అంటుంటారు బీఆర్ఎస్ శ్రేణులు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన తీసుకున్న పలు నిర్ణయాలనే ఉదాహరణగా చెబుతుంటారు. ఇక చంద్రబాబు గురించి టీడీపీ శ్రేణుల్ని అడిగితే.. ఆయన ఆలోచనలు అంతకుమించి.. అనేలా ఉంటాయని అంటుంటారు. ఈ ఇద్దరు నేతలు ప్రజెంట్ ఎవరి దారుల్లో వాళ్లు వెళ్తున్నారు. అయితే.. చంద్రబాబు ఒకనాడు తీసుకున్న నిర్ణయాలనే కేసీఆర్ ఇప్పుడు ఫాలో అవుతుండడం చర్చనీయాంశంగా మారింది.
2014లో తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అదే టైమ్ లో కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అయినా.. సెంటిమెంట్ వర్కవుట్ అయి ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. కాంగ్రెస్ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థిగా ఉండడంతో.. కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ వచ్చారు కేసీఆర్. పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా ఆమోదం తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర పెద్దలు వస్తే ఆహ్వానం పలికారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. జాతీయ రాజకీయాల ఆశతో బీజేపీపై యుద్ధం ప్రకటించారు. అన్ని విషయాల్లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ లీడర్లు ఎవరొచ్చినా ఝలక్ ఇస్తున్నారు.
ఇదంతా ఒకప్పుడు చంద్రబాబు అవలంభించారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో ఏపీలో అధికారం దక్కించుకుంది టీడీపీ. కానీ, తర్వాత బీజేపీ సర్కార్ పై యుద్ధం ప్రకటించారు చంద్రబాబు. ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో పంచ్ డైలాగులు విసిరారు. కేసీఆర్ కూడా అచ్చం అలాగే చేశారు. ఆయన మాదిరిగానే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వారు. కేంద్ర పెద్దలు వస్తే అవమానించి పంపారు. కేసీఆర్ కూడా అదే స్ట్రాటజీని అమలు చేశారు. ఇటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా బాబు బాటలోనే పయనిస్తున్నారు కేసీఆర్.
ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడి ఇంటెలిజెన్స్ బృందాలను తెలంగాణకు పంపారు చంద్రబాబు. అవి విస్తృతంగా ప్రజాభిప్రాయసేకరణ జరిపి కీలక విషయాలను రాబట్టాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు కేసీఆర్ తమ ఇంటెలిజెన్స్ పోలీసుల్ని ఏపీలో పరిస్థితిని అధ్యయనం చేయడానికి పంపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ లో ఈమధ్యే ముగ్గురు నేతలు చేరారు. వారి రాక తర్వాత పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయాలని.. అవకాశాలు, ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.
పదికి పైగా తెలంగాణ బృందాలు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన.. తెలంగాణ సర్కార్ పథకాలపై అభిప్రాయం.. కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి.. ఏ వర్గాన్ని నమ్ముకుంటే ఓటు బ్యాంక్ వస్తుంది. ఇలాంటి అంశాలపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్టుగా చెబుతున్నారు. అప్పట్లో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణలో పర్యటిస్తే పలుచోట్ల స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. కానీ, ఇప్పుడు ఏపీలో అలా అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. అక్కడ ఉన్నది కేసీఆర్ ఫ్రెండ్ జగన్ ప్రభుత్వమే.