తెలంగాణలో వృద్ధ దంపతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే బాధ్యుడని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. ఇటీవల జగిత్యాల జిల్లా రఘురాములకోట గ్రామంలో వృద్ధ దంపుతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని, వారి సూసైడ్‌కు సీఎంయే కారణమని పేర్కొన్నారు.
రఘురామలకోటకు చెందిన వృద్ధ దంపతులు సింహరాజు మునీధర్, సులోచన ఆర్థిక సమస్యలతో చాలా కాలం నుంచి సతమతమవుతున్నారని తెలిపారు. వారు మూడు సార్లు ఆసరా పెన్షన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే, వారు అన్ని సార్లు అప్లికేషన్ చేసుకున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చెప్పారు.
అటు ‘ఆసరా’ లేక, వైద్యానికి డబ్బులు లేక వారు ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలోనే తీవ్రమనస్తాపానికి గురై వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. తెలంగాణలో ఇప్పటికీ 3.15 లక్షల ఆసరా పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
గ్రామీణ ఆస్పత్రుల్లో మందులు అందడం లేదని వివరించారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌ను బాధ్యుడిని చేయాలని కంప్లయింట్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను బక్క జడ్సన్ కోరారు.