ఒక మనిషిని హీరో చేయాలన్నా.. జీరో చేయాలన్నా ప్రస్తుతం మీడియానే ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. అందుకే రాజకీయ నాయకులు న్యూస్ ఛానళ్లు, పత్రికలను కొనడమో.. పెట్టుబడులు పెట్టడమో చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జాతీయ పార్టీ ప్రమోషన్ కోసం మరో రెండు ఛానళ్లను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా టాక్. ఢిల్లీ కేంద్రంగా హిందీ, ఇంగ్లీష్ ఛానళ్ల ఏర్పాటుకు పథక రచన జరుగుతున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. కొత్త ఛానళ్ల కోసం శాటిలైట్ అనుమతులు తీసుకోవాలా? లేక ఇప్పటికే ఉన్న ఛానళ్లతో అగ్రిమెంట్ చేసుకోవాలా? అనే దానిపై కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.
ఛానళ్ల ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పెద్దలు ఢిల్లీలో సీనియర్ జర్నలిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత అందులోనే ఛానళ్లు ఏర్పాటు చేసే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని అనుకుంటున్నారు. అప్పటి వరకు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా నడిచే తమ పార్టీ ఛానల్ నెట్ వర్క్ నే అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
రాజకీయ పార్టీకి సంబంధించిన అజెండాలు, అభిప్రాయాలు జనంలోకి తీసుకెళ్లాలంటే మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జాతీయ స్థాయిలో ఉన్న పలు పార్టీలకు సొంత ఛానళ్లు ఉన్న క్రమంలో.. తాను కూడా తమ గళం వినిపించేందుకు నేషనల్ ఛానెళ్లు పెట్టుకోవాలని గులాబీ బాస్ యోచిస్తున్నట్టుగా చెబుతున్నారు.