ప్రశ్నిస్తే అరెస్టులు.. నిలదీస్తే బెదిరింపులు.. ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో జరుగుతోంది ఇదే. మీరు చేసేది తప్పని చెప్తే చాలు గులాబీలు రగిలిపోతున్న పరిస్థితి. చాలాచోట్ల అక్రమ కేసులతో వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీఆర్ఎస్ నేతల అరాచకాలు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా రాకపోయినా సోషల్ మీడియా మాత్రం ఎండగడుతోంది. అయితే.. సాంప్రదాయ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్న కేసీఆర్ కు సోషల్ మీడియా నిద్ర లేకుండా చేస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ ప్రజలకు వివరిస్తున్నాయని.. అవినీతిని, గులాబీ నేతల ఆగడాలను అర్థం అయ్యేలా విశ్లేషణ చేస్తున్నాయని చెబుతున్నారు.
తెలంగాణలో పోలీస్ స్టేషన్లు టీఆర్ఎస్ కార్యాలయాలుగా మారుతున్నాయనే భావన ప్రజల్లో ఉందనే విషయాన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న భూ సెటిల్మెంట్లను, కబ్జాలను వెలుగులోకి తెస్తున్నాయి. అయితే.. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అనే కామెంట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే సోషల్ మీడియాపై కేసీఆర్ ఉక్కుపాదం మోపుతున్నారని గుర్తు చేస్తున్నారు. కడుపు పట్టుకొని నోరు కట్టుకుని పాలన చేస్తున్నాం అని సారు చెబుతున్నారు కానీ.. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. చివరికి ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలకు అంతు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ పరిశీలకులు మరో అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత జరిగిన వివిధ ఎన్నికల్లో చేసిన ఖర్చును పరిశీలిస్తే అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2014లో మెదక్ పార్లమెంట్ కు మొట్ట మొదటి ఉప ఎన్నిక జరిగింది. ఆ తర్వాత వరంగల్ పార్లమెంట్ కు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఇతర మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అలా అప్పటి నుండి మొన్నటి హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు టీఆర్ఎస్ ఖర్చు చూస్తే కేసీఆర్ కడుపు పట్టుకొని నోరు కట్టుకొని పని చేస్తున్నారా? లేదా అనే విషయం అర్థం అవుతోందని అంటున్నారు.
ఇప్పటి దాకా టీఆర్ఎస్ చేసిన ఎన్నికల ఖర్చును బయటకు తీస్తే కేసీఆర్ పాలన ఎలా వుందో తేలిపోతుందని చెబుతున్నారు విశ్లేషకులు. అంతేకాదు 2014కి ముందు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను.. ఇప్పటి ఆస్తులను పరిశీలిస్తే అవినీతి పెరిగిందా? తగ్గిందా? ఏ స్థాయిలో వుందో తెలుస్తుందని చురకలంటిస్తున్నారు. ఈ విషయాలపై సాధారణ ప్రజల స్థాయిలో కూడా చర్చ జరుగుతోందని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ చర్చకు యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లు ఊతం ఇస్తూ వార్తా కథనాలను నిత్యం ప్రసారం చేస్తున్నాయి. మెయిన్ ఛానల్స్, పత్రికలను కేసీఆర్ మేనేజ్ చేయగలిగారు గానీ.. సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే వాటిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారని విశ్లేషణ చేస్తున్నారు. ఒకవైపు యూట్యూబ్ ఛానల్స్ పై ఒత్తిడి తెస్తూ వారికి డబ్బులు ముట్టచెప్పి తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారని.. లొంగని వారిపై కేసులు బనాయించి భయపెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే.. సోషల్ మీడియాను ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా కుదిరే పని కాదని అంటున్నారు. పైగా రానున్న రోజుల్లో పోలీసులకు తలనొప్పులు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు డైరక్షన్ కు వ్యతిరేకంగా అనవసరంగా కేసులు బనాయిస్తే వాటిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తే పోలీసులకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.