– నిరుద్యోగుల ఆత్మహత్యలు కదిలించలేదు
– అయినా.. ఉన్నట్టుండి ఉద్యోగ నోటిఫికేషన్లు
– అన్నదాత చావులు గుండెను కరిగించలే!
– అయినా.. సడన్ గా వరి కొంటామని బీరాలు
– గులాబీల కబ్జాలతో..గుండెపగిలిన గిరిజనం కన్పించలే!
– అయినా..ఉన్నట్టుండి గ్రామాభివృద్ధి జపం
– రాజ్యాంగం మార్చాలంటూ..బాబాసాహెబ్ నే అవమానించేలా!
– ఇప్పుడేమో.. మర్చిపోయిన అంబేద్కర్ విగ్రహం స్పీడ్ గా!
– ఏదిఏమైనా సారులో పెరిగిన దూకుడు..
– ఓటమి భయంలో నుంచి వచ్చిందేనా?
– అంతా.. ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకేనా?
Advertisements
– రాజకీయ పండితులు ఏమంటున్నారు?
తెలంగాణలో టీఆర్ఎస్ కి తిరుగులేదు.. కేసీఆర్ మాటకు ఎదురు లేదు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కారు టైర్ కు పంక్చర్.. సారు మాటలతో జనానికి టార్చర్ కనపడుతోందని అంటున్నారు రాజకీయ పండితులు. మొదటిసారి అంటే.. సెంట్ మెంట్ వర్కవుట్ కావడంతో గెలిచారు.. రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి తప్పించుకున్నారు.. కానీ.. మూడోసారి టీఆర్ఎస్ గెలుపు అంత ఈజీగా కనిపించడం లేదు. ఎన్నాళ్లని మాటలతో మాయ చేయగలం.. ప్రజలకన్నీ అర్థం అయిపోయాయి. మాటలు కోటలు దాటతున్నాయే గానీ.. చేతలు గడప దాటడం లేదని తెలిసిపోయింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు సక్సెస్ అయ్యాయని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే.. రానున్న ప్రమాదాన్ని పీకే ద్వారా పసిగట్టి భయంతో కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.
తెలంగాణ సాధించుకుందే నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం. కానీ.. నీళ్లేమో కేసీఆర్ ఫాంహౌస్ కి, నిధులేమో ఆయన అనుచరులు, గులాబీ నేతలకి.. నియామకాలు కల్వకుంట్ల కుంటుంబానికి అందాయనే విమర్శలు ఉన్నాయి. నీళ్లు, నిధుల విషయం పక్కనపెడితే.. 8 ఏళ్లుగా నియామకాల విషయంలో కేసీఆర్ చేసిన మోసాన్ని నిరుద్యోగులు ఎంతకీ మర్చిపోవడం లేదు. అందుకే 90 వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేస్తున్నామని చెప్పినా.. ఎక్కడా నిరుద్యోగులు పాలాభిషేకాలు చేసిన దాఖలాలు కనిపించలేదని చెబుతున్నారు విశ్లేషకులు. అయినా కూడా.. కేసీఆర్ ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారని.. దానికి కారణం ఓటమి భయమేనని అంటున్నారు. ఎలాగోలా నిరుద్యోగులను మచ్చిక చేసుకుంటే.. గెలుపు నల్లేరు మీద నడకనే భావనలో ఆయన ఉన్నట్లుగా విశ్లేషణ చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ ను నిరుద్యోగులు నమ్ముతారా? లేదా? అనే సందేహం వ్యక్తం అవుతోంది.
కేసీఆర్ దూకుడులో రెండో అంశం.. ధాన్యం కొనుగోళ్లు. తాను ఒకటి తలిస్తే.. దైవం ఇంకోటి తలచినట్లు.. ధాన్యం విషయంలో కేసీఆర్ పరువు పోయిందని అంటున్నారు విశ్లేషకులు. ఎలాగైనా రైతుల్లో పెరిగిన వ్యతిరేకతను కేంద్రంపై డైవర్ట్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తే.. అది చివరకు రివర్స్ అయ్యిందని చెబుతున్నారు. చేయాల్సిన సంతకాలన్నీ ముందే చేసి.. తర్వాత కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని బీజేపీ నేతలు అన్నీ క్లారిటీగా వివరించారు. దీనిపై రైతుల్లో తీవ్రంగా చర్చ నడిచింది. సరిగ్గా అదే టైమ్ లో తెగే వరకు లాగితే మరింత డేంజర్ అని గ్రహించి.. చివరకు తామే కొంటామని కేసీఆర్ ముందుకొచ్చారని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో రైతుల్లో మరింత వ్యతిరేకతను కేసీఆర్ మూట గట్టుకున్నారని చెబుతున్నారు. అయినా కూడా.. తప్పంతా కేంద్రానిదేనని గట్టిగా వాదిస్తున్నారు కేసీఆర్.
దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ ఎన్నికల సమయంలో తీసుకొచ్చారు కేసీఆర్. అయితే.. ఇది టీఆర్ఎస్ ఓటమిని ఆపలేకపోయింది. ఆ తర్వాత పథకాన్ని అటకెక్కించారు. అయితే.. ఈ మధ్య దీనిపై కాస్త దూకుడుగా ఉంటున్నారు. కొన్నిచోట్ల వాహనాలు డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు. పైగా మంత్రి కేటీఆర్ అయితే.. ఓ అడుగు ముందుకేసి.. దళిత బంధు లాగే ఇతర కులాల్లోనూ పథకాలు తెస్తామని వెళ్లిన ప్రతీ మీటింగ్ లోనూ చెబుతున్నారు. ఇంత సడెన్ గా దళిత బంధు పథకం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేక సందేహాలకు తావిస్తోంది.
హైదరాబాద్ లో ఎన్టీఆర్ పార్క్ దగ్గర 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎప్పుడో చెప్పారు కేసీఆర్. అంబేద్కర్ జయంతి, వర్ధంతులు జరుగుతున్నాయేగానీ.. ఆ విగ్రహ పనులు మాత్రం నత్తనడకనే సాగుతూ వస్తున్నాయి. కానీ.. సడెన్ గా కేసీఆర్, కేటీఆర్ కు అంబేద్కర్ విగ్రహం గుర్తుకు రావడం.. ఆ ప్రాంతాన్ని పరిశీలించడం.. ఈ డిసెంబర్ కల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చూస్తుంటే.. ఏదో తేడాగానే ఉందంటున్నారు విశ్లేషకులు. ఇవే కాదు.. అటు జిల్లాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు గులాబీ నేతలు.
మూడోసారి గెలుపు కష్టమని పీకే సర్వేలు తేల్చడం వల్లే కేసీఆర్ లో దూకుడు పెరిగిందని అంటున్నారు విశ్లేషకులు. అయితే.. పెరిగిన ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకే అభివృద్ధి, వరాలతో ప్రజలకు గాలం వేసే పనిలో ఉన్నారని చెబుతున్నారు. ఇంకోవైపు ఈ దూకుడుకు ముందస్తు కూడా ఓ కారణం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసీఆర్ ను నమ్మడానికి లేదు. ఆయన ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో.. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. మూడోసారి గెలుపు అసాధ్యమని ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే సర్వేలు తేల్చేశాయి. అంతేకాదు. ఆప్తుడు..ఆపదలో అండగా ఉంటాడనుకున్న పీకే ఏకంగా జెండా ఎత్తేయటంతో.. కేసీఆర్ లో దూకుడు పెరిగిందని అంటున్నారు విశ్లేషకులు. అందుకే పెరిగిన ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకే అభివృద్ధి, వరాలతో ప్రజలకు గాలం వేసే పనిలో ఉన్నారని చెబుతున్నారు. అటు.. కుటుంబ నియంతృత్వానికి విసిగి వేసారిన గులాబీ నేతలు..ఒక్కొక్కరుగా ఈటల బాటలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం కేసీఆర్ ఎన్ని కుప్పిగంతులు వేసినా.. ఈసారి ఓడించి తీరుతామని గట్టిగా చెబుతున్నాయి.