ఓ హాట్ టాపిక్ రెండు తెలుగురాష్ట్రాల్లో చక్కర్లు కొడుతుంది. ఒక వేళ అదే నిజమైతే త్వరలోనే రెండు రాష్ట్రాల సీఎంలు ఒకే చోట, ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దీంతో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ కలయిక ఓ కీలక పరిణామమే అవుతుంది. ఎక్కడ ఎందుకు అనే విషయానికొస్తే..
త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే కార్యక్రమానికి హాజరుకాబోతున్నారని ప్రచారం జోరందుకుంది. విశాఖలోని శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి 31 వరకు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం ఆహ్వానం అందినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నెల 28న జగన్ శారదా పీఠానికి వెళ్లనుండగా అదే సమయంలో కేసీఆర్ సైతం అక్కడికి వెళ్లి రాజశ్యామల యాగంలో పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరితో పాటు పంజాబ్, హర్యానా,తమిళనాడు గవర్నర్లు కూడా ఈ యాగంలో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే కేసీఆర్ హాజరుపై స్పష్టమైన క్లారిటీ లేనప్పటికి శారదా పీఠంతో ఆయనకున్న అనుబంధం, పైగా ఇది ఎన్నికల సమయం కావడంతో ఆయన ఈ యాగంలో తప్పక పాల్గొంటారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే జగన్, కేసీఆర్ ఒకే రోజు శారదా పీఠానికి వస్తే ఇది రాజకీయంగా ఆసక్తికర పరిణామమే అవుతుంది.
ఇక గతంలో ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నా ఆ తర్వాతి కాలంలో కృష్ణా జలాలు, పోతిరెడ్డి పాడు వివాదాల కారణంగా కేసీఆర్ జగన్ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భావం చెందడం, ఏపీలో పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తుండడంతో బీఆర్ఎస్,వైసీపీ నేతల మధ్య వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్, కేసీఆర్ ఒకే కార్యక్రమానికి హాజరు అవుతారా.. ఒక వేళ యాగానికి అటెండ్ అయితే ఇద్దరు నేతల మధ్య ఏదైనా చర్చలు జరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.