బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాటలపై ప్రతిపక్షాలు కౌంటర్ ఎటాక్ కు దిగుతున్నాయి. సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు అద్దాల వెనుక ఉన్న మిఠాయిళ్లా ఉన్నాయని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ విమర్శించారు. అనేక మంది ప్రాణ త్యాగాలతో కేసీఆర్ కు అధికారం కట్టబెడితే బీఆర్ఎస్ సభలో కనీసం జై తెలంగాణ అని పలక లేకపోవడం నిజంగా విషాదకరం అని మండిపడ్డారు.
తెలంగాణ పేరు ఎత్తడానికే సిగ్గుపడితే రేపు తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తారని నిలదీశారు. కేసీఆర్ మాటలకు రాష్ట్రంలోని పరిస్థితులకు వైరుధ్యం ఉందని ధ్వజమెత్తారు. దేశంలో విస్తారమైన జల సంపద ఉన్నా సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శిస్తున్న కేసీఆర్.. కృష్ణా నదిపై ప్రాజెక్టులు పెండింగ్ విషయంపై ఎందుకు స్పందించడం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం పచ్చి అబద్దం అన్నారు. ఈ ప్రాజెక్టులో కట్టలు మాత్రమే పూర్తయ్యాయని కాలువలు ఇంకా పూర్తి కాలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు వచ్చినా అవి కాళేశ్వరం నీళ్లు అని చెప్పడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అప్పుల పాలైన రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ దేశంలో ఏం పరిపాలిస్తారని ప్రశ్నించారు.
తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, కేసీఆర్ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కోదండ రామ్ ఛలో ఢిల్లీ గోడ పత్రికలు,కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 30 న కృష్ణా జలాల వాటా, విభజన హామీల సాధన కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని చెప్పారు.