ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సభకు పలువురు జాతీయ నాయకులు కూడా హాజరవుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా మరికొందరు నేతలు వస్తున్నారు. అయితే.. సభ కంటే ముందే వీరంతా యాదాద్రికి వెళ్తున్నట్లు సమాచారం.
మూడు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి ఆలయాన్ని ఆరోజు సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను యాదాద్రి బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ముగ్గురు సీఎంల పర్యటన నేపథ్యంలో రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్ యాదాద్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అంతేకాకుండా ప్రెసిడెన్షియల్ సూట్స్, హెలిప్యాడ్ స్థలానికి కూడా ఆయన వెళ్లారు.
స్వామి వారి దర్శనం అనంతరం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు సీఎం కేసీఆర్ సహా జాతీయ నేతలు వెళ్లనున్నారు. బీఆర్‌ఎస్ తొలి సభ కావడంతో సెంటిమెంట్ గా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మంత్రులు హరీష్, పువ్వాడ అజయ్ దగ్గరుండి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.