కొంతకాలంగా కేసీఆర్, కేటీఆర్ చర్యలను, మాటలను సరిగ్గా గమనించారా..? ముఖ్యంగా కేంద్రం విషయంలో వారి ఓవర్ స్పీడ్ ను చూస్తున్నారుగా..? ఏదో తేడాగా అనిపించడం లేదా..? కేంద్రంపై పెద్ద సారు యుద్ధం అనడం.. తండ్రి అడుగుజాడల్లోనే చిన్న సారు కామెంట్లు చేయడం.. పైగా తిట్ల దండకంలో కొత్త పదాలను జోడించడం అన్నీ చూస్తున్న రాజకీయ విశ్లేషకులు రెండు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు వచ్చాయని అందుకే కేంద్రంపై యుద్దం ప్రకటించారని కొందరి విశ్లేషణ. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవకతవకలపై ఈడీ నోటీసులు అందాయని ఇంకొందరి వాదన. తెల్లాపూర్ లో టెక్నో పార్క్ పేరుతో కేటాయించిన 400 ఎకరాల భూమి విషయంలో జరిగిన అవకతవకలపై ఈడీ నోటీసులు అందుకున్నారనేది మరికొందరి కథనం. ఈడీ పరిణామాలు రేపటి రోజున ఎలా వుంటాయో అనే ఉద్దేశంతోనే కేసీఆర్ కేంద్రంపై కన్నెర్ర చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై గట్టిగా మాట్లాడినందుకే మోడీ, అమిత్ షా తనపై కక్ష గట్టి వేధింపులకు గురి చేస్తున్నారని కలరింగ్ ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ముందస్తు వ్యూహంతో ధాన్యం కొనుగోలు విషయాన్ని అడ్డం పెట్టుకొని కేంద్రంపై యుద్దం ప్రకటించారని విశ్లేషిస్తున్నారు.
ఈడీ నోటీసుల ఫ్రస్టేషన్ తోనే కేసీఆర్, కేటీఆర్ లు తిట్ల పురాణం మొదలు పెట్టారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయం ఎలా వున్నా వారి తిట్ల పురాణం వెనుక మరో కారణం కూడా వుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చెన్నై కి చెందిన సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను టీఆర్ఎస్ పార్టీ వ్యూహకర్తగా ఇటీవల కేసీఆర్ నియమించారని తెలుస్తోంది. ఈయన గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పని చేశాడు. ఆమధ్య జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం అన్నాడీఎంకే గెలుపు కోసం కష్టపడ్డాడని సమచారం. ఆయన సూచనల మేరకే కేసీఆర్, కేటీఆర్ తిట్ల దండకం మొదలు పెట్టారని చెబుతున్నారు. తీన్మార్ మల్లన్న భాషనే మీరు కూడా మాట్లాడాలని చెప్పినట్లు టాక్. మల్లన్న సక్సెస్ కి అయన వాడిన భాషే కారణమని.. అలా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో లక్ష ఓట్లు తెచ్చుకోగలిగాడని వివరించాడట. రేవంత్ రెడ్డి కూడా అలా మాట్లాడే ప్రజల్లో ఇమేజ్ తెచ్చుకున్నారని హితబోధ చేశాడట. అందుకే అప్పటి నుండి కేటీఆర్, కేసీఆర్ అదే భాషను వాడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్ వాడుతున్న భాష రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఏదో ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని కొందరు విశ్లేషణ చేస్తుంటే.. వారి రాజకీయ వ్యూహకర్త డైరక్షన్ లో భాగంగానే ఇలా చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ లెజిస్లేచర్ మీటింగ్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మనం కూడా మంచి వ్యూహకర్తను నియమించుకున్నాం.. ఇక మనకి తిరుగులేదు అందరిని చీల్చి చెండాడమే అని వారితో చెప్పినట్లు తెలుస్తొంది. దీనిపైనా టీఆర్ఎస్ లో రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. మన బాస్ ఎత్తుగడల ముందు ఎవరు తట్టుకోలేరు అని కొందరు అనుకుంటుంటే.. సారు ఏంటి..? మంచి వ్యూహకర్తను తెచ్చుకున్నాం.. మనకు తిరుగులేదని చెప్పడం ఏంటని? అనుకుంటున్నారట. సదరు వ్యూహకర్త చెప్పిన భాషను మనం కూడా వాడితే మటాషే అని చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్, కేటీఆర్ వాడుతున్న భాషపై అటు రాజకీయ వర్గాల్లో ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ప్రజలు మాత్రం తీన్మార్ మల్లన్న దారిలోకి తండ్రీకుమారులు వచ్చారని మాట్లాడుకుంటున్నారు.