తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.
రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నట్టు చెప్తున్నారు. ఈ నెల 22న ఢిల్లీ నుంచి ఆయన చండీఘడ్ వెళ్లి.. రైతు ఉద్యమంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నట్టు తెలిపారు.
అందులో భాగంగానే బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఈ నెల 26న ఉదయం కేసీఆర్ బెంగళూరుకు వెళ్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ కానున్నారు.
మే 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధీకి వెళ్లి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శించుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.