ఎరువుల ధర పెంపు విషయంలో కేంద్రంపై చిర్రుబిర్రులాడుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం ఊదరగొట్టిందన్న ఆయన.. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఐదేళ్లలో అన్ని రేట్లు డబుల్ అయ్యాయని.. పెట్రో రేట్లు పెరగడం కూడా రైతులకు భారమైందన్నారు.
కేంద్రం ఎరువుల ధరలు పెంచి అన్నదాతల నడ్డి విరిచిందన్నారు సీఎం. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని.. ఎరువుల ధరలు ఇప్పుడు ఉన్నట్లుగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్నదాతలను బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయట్లేదన్న కేసీఆర్… పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
వ్యవసాయ ఖర్చు విపరీతంగా పెరిగిందన్న కేసీఆర్.. కేంద్ర నిర్ణయాలతో రైతు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గుర్తు చేశారు. ఎమ్మెస్పీని 150శాతం పెంచామంటూ అందరినీ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. రైతులకు సరైన మద్దతు ధర లేదని.. ధాన్యం కూడా తక్కువ కొంటున్నారన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని.. గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తారా? అని ప్రశ్నించారు సీఎం.