కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తప్పుడు విధానాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్నామ్నాయం బీజేపీయే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందని రాజ్ గోపాల్ ఆరోపించారు. తెలంగాణ అంటే కొడుకు, కూతురు మాత్రమే ఉన్నారా..ప్రజల అవసరాలు కనపడలేదా అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.
కేసీఆర్ ఎనిమిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆరోపించారు. మోడీ విధానాల ఫలితంగా ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తుందన్నారు ఆయన. ఆలేరు ఎమ్మెల్యే అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు కూడగట్టుకున్నారని రాజ్ గోపాల్ మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం పై 68 శాతం ప్రజా వ్యతిరేకత ఉన్నందున.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు.