– కేసీఆర్ జాతీయ మంత్రం వెనుక పెద్ద స్కెచ్
– మూడు ప్రధాన కారణాల్ని వివరిస్తున్న విశ్లేషకులు
దేశం దారి తప్పుతోంది.. ఈ మత కల్లోలు ఏంటి?.. ఈ క్యాన్సర్ ను నలిపి పారేయాలి.. చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతా.. భారత్ ను సెట్ రైట్ చేస్తా.. బీజేపీని తరిమేస్తా.. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం చేస్తున్న కామెంట్స్ ఇవి. ఎంతో బలమైన బీజేపీని ఢీకొట్టాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలనేది కేసీఆర్ ఆలోచేన. కాంగ్రెస్ లేకుండా ఆయన వల్ల ఏం కాదనేది హస్తం నేతల వాదన. ఈ విషయాన్ని పక్కకు పెడితే.. కేసీఆర్ లో వచ్చిన ఈ సడెన్ ఛేంజ్ వెనుక మూడు బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల వెనుక విశ్లేషకులు చెబుతున్న మూడు కారణాలు
1. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం
2. కేసీఆర్ కు ఇంటిపోరు
3. టీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం దృష్టి
కేసీఆర్ బంగారు భారత్ నినాదం వెనుక ఈ మూడు కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
రాష్ట్రంలో బీజేపీ బలోపేతం
తెలంగాణలో బీజేపీ హైదరాబాద్ కే పరిమితం.. ఇది ఒకప్పటి మాట. మాస్ లీడర్ గా కరీంనగర్ గడ్డపై బాగా ఫాలోయింగ్ ఉన్న బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ తో సై అంటే సై అనేలా బండి వ్యవహరించిన తీరు క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు వారికి మరింత బూస్టప్ లా మారింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ విజయం.. ఢీ అంటే ఢీ అంటూ బీజేపీ నేతలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో గ్యాప్ లేకుండా ప్రభుత్వంపై పోరుబాట చేయడంతో రాష్ట్రంలో పార్టీ బలపడిందని అంటున్నారు విశ్లేషకులు. దీన్ని గమనించిన కేసీఆర్ ఇక ఊరుకుంటే లాభం లేదని యుద్ధం ప్రకటించారని చెబుతున్నారు. నిజానికి 2014 నుంచి బీజేపీకి పరోక్షంగా స్నేహహస్తం ఇస్తూ కేసీఆర్ వచ్చారని గుర్తు చేశారు. సడన్ గా తెలంగాణలో బీజేపీ రేసులోకి రావడంతో ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీనే కాకుండా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ను కూడా టార్గెట్ చేయడం వెనుక ఇంకో రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
కేసీఆర్ కు ఇంటిపోరు
కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి.. రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేయడం ఒక కారణమైతే.. ఇంటిపోరు మరో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. తెలంగాణ కొత్త సీఎంగా కేటీఆర్ అని కొన్నేళ్లుగా పేపర్లు, ఛానల్స్ కు లీకులు ఇవ్వడమే గానీ.. అది సాధ్యం కావడం లేదు. ఎన్నాళ్లని ఎదురుచూడాలని కేటీఆర్.. కేసీఆర్ తో యుద్ధానికి దిగారని ఈ విషయంలో తరచూ ఇంట్లో సామాన్లు కూడా పగిలిపోతున్నాయని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. అందుకే ఓవైపు రాష్ట్రంలోని బీజేపీని అదుపు చేస్తూనే.. జాతీయ రాజకీయాల పేరుతో ఢిల్లీకి వెళ్తే.. ఇక్కడ కేటీఆర్ కు లైన్ క్లియర్ అవుతుందని కేసీఆర్ భావించి ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. మోడీ వల్ల దేశమంతా నాశనమైందని చేస్తున్న కామెంట్స్ ఆ ప్లాన్ లో భాగమేనని అంటున్నారు.
టీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం దృష్టి
తెలంగాణలో తాను అద్భుతమైన అభివృద్ధి చేశానని.. ఇక దేశం కూడా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి అవ్వాలని చెప్పి హడావుడి చేస్తున్నారు కేసీఆర్. అయితే.. బంగారు తెలంగాణ ఎక్కడ అయిందో చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేసీఆర్ చెప్తున్న బంగారు భారత్ అంతా పెద్ద నాటకమని అంటోంది. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్, ఆయన ఫ్యామిలీ ఆస్తులెన్ని? ఇప్పుడెన్నని నిలదీస్తోంది. సీఎం అవినీతిపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయని.. త్వరలోనే ఎంక్వైరీ షురూ కాబోతోందని కొన్నాళ్లుగా చెబుతూ వస్తోంది. ఈ విషయం తెలిసి కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తోంది బీజేపీ. ఇలా రాష్ట్రంలో బీజేపీని అదుపు చేస్తూనే కేటీఆర్ ను సీఎం చేయాలని.. తనపై చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అనేలా కలరింగ్ ఇవ్వాలని.. ఒకే దెబ్బకు మూడు అనేలా పీకే డైరెక్షన్ లో కేసీఆర్ ప్లాన్ చేశారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.