– పీకే డైరెక్షన్ లో.. మేఘా నిర్మాణంలో..
– కేసీఆర్ రాజకీయ చిత్రం!
– మోడీని ఢీకొట్టేందుకు ‘మెగా’ ప్లాన్
– బలహీన ప్రభుత్వం కోసం పక్కా స్కెచ్!
– కేసీఆర్ జాతీయ రాజకీయాలపై..
– తెలంగాణ వాదుల విశ్లేషణ
సెంటర్ అయినా.. స్టేటైనా.. పొజిషన్ అయినా.. అపోజిషన్ అయినా.. పవర్ అయినా.. పొగరు అయినా.. నేను దిగనంతవరకే.. వన్స్ ఐ స్టెపిన్ హిస్టరీ రిపీట్.. అనే రేంజ్ లో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయనలో వచ్చిన ఈ సడెన్ ఛేంజ్ వెనుక రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ పెద్దలతో కేసీఆర్ కు ఎక్కడ చెడింది.. వివాదానికి గల కారణాలేంటి? రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే ఆయన కేంద్రంపై వార్ డిక్లేర్ చేశారా? అసలు ఇది నిజమేనా? అనే ప్రశ్నల్ని తెరపైకి తెస్తున్నారు తెలంగాణ వాదులు. మొన్నటిదాకా కేంద్రానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించి.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని మోడీపై ఎందుకు యుద్ధం ప్రకటించాల్సి వచ్చిందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ అవినీతిని బయటకి తీస్తాం.. కాళేశ్వరం, మిషన్ భగీరథలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తాం.. కేసీఆర్ ని జైలుకు పంపుతాం.. బీజేపీ నాయకులు పదే పదే కామెంట్ చేస్తున్నారు. కేంద్రంతో కేసీఆర్ మంచిగానే ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. కొన్నాళ్లక్రితం మోడీ, అమిత్ షాలతో భేటీ అయి కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్న కొన్ని గంటలకే బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శించారు. నువ్వు ఒంగి ఒంగి దండాలు పెట్టినా.. పొర్లి పొర్లి దండాలు పెట్టినా జైలుకుపోవడం ఖాయం అంటూ కామెంట్ చేశారు. ఢిల్లీ అదినాయకత్వమే బండిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టించిందనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది.
బండి సంజయ్ తో మాట్లాడిస్తుంది మోడీ, అమిత్ షాలే అని కేసీఆర్ లేటుగా గుర్తించి.. కేంద్రంపై యుద్ధం ప్రకటించి ఉంటారని అంటున్నారు తెలంగాణ వాదులు. కాళేశ్వరం, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ పనులను టీఆర్ఎస్ సర్కార్ మేఘా కృష్ణారెడ్డికి అప్పజెప్పింది. ఈ కాంట్రాక్టుల ద్వారా సుమారు రూ.80వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్ పదే పదే మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా మేఘా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరరావు, ప్రతిమ శ్రీనివాసరావుల సంస్థలపై ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేస్తున్నారు తెలంగాణ వాదులు. ఈ దాడులు తరువాత మేఘా కృష్ణారెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కలిసినట్లు వార్తలు కూడా వచ్చాయని గుర్తు చేస్తున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి వెనుక కృష్ణారెడ్డి హస్తం ఉందనేది రాజకీయ పండితుల వాదన. ఆయనకు కావాల్సిన నిధులను మేఘా సమకూరుస్తోందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2019లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఫండింగ్ చేశారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో తెగ చర్చ నడిచింది. ఈ విషయం మోడీకి కోపం తెప్పించిందని.. అప్పటి నుంచే కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం, మిషన్ భగీరథలలో జరిగిన అవినీతిపై కేంద్రం దృష్టి సారించిందని వివరిస్తున్నారు. తాజాగా మోడీ నాయకత్వంలోని కేంద్రంపై కేసీఆర్ చెయ్యబోతున్న యుద్ధానికి కూడా మేఘా కృష్ణారెడ్డే నిధులు సమకూరుస్తున్నాడని చెబుతున్నారు.
ఇదంతా మేఘా నిర్మాణంలో పీకే డైరెక్షన్ లో కేసీఆర్ నటిస్తున్న రాజకీయ చిత్రమని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు విశ్లేషకులు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి బలహీనమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలోకి తేవాలన్నదే ఈ ముగ్గురి వ్యూహంగా అంచనా వేస్తున్నారు. ఇందుకు ఇటీవల పీకే ఇచ్చిన ఇంటర్వ్యూనే ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తానికి పీకే డైరెక్షన్ లో దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి చక్రం తిప్పాలని కేసీఆర్ చూస్తున్నారని.. వెనుక నిలబడి నిధులు సమకూర్చే బాధ్యతను మేఘా కృష్ణారెడ్డి తీసుకున్నాడని అంటున్నారు విశ్లేషకులు.