దోస్తీ కుదిరితే ఒకలా… దోస్తానా చెడిపోతే మరోలా.. రాజకీయ నాయకులకు… ప్రజలకేం కావాలో కాదు.. వారికేం కావాలనేదే ముఖ్యమైపోయింది. దాన్ని బట్టే సిద్ధాంతాలు.. విధానాలు తయారు చేసుకుంటున్నారు. పైకి మాత్రం ఏం చేసినా ప్రజల కోసమే చేస్తున్నట్లు ఫోజులు కొడతారు. అది చూసి కొందరు మోసపోతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు చూపిస్తున్న అప్రోచ్ చూస్తే.. ఈ విషయం ఎవరికైనా అర్ధమవుతుంది. ఏపీ జీఎస్టీ విషయంలో కాంప్రమైజ్ అయిపోతే.. కేసీఆర్ డామిట్ కుదరదంటున్నారు. ఏపీ విద్యుత్ మీటర్ల విషయంలో సై అంటే.. కేసీఆర్ మాత్రం నై అంటున్నారు. మాకు డబ్బులు కావాలి… నవరత్నాలకు ఖర్చు పెట్టుకోవాలి.. కాబట్టి జీఎస్టీకి ఓకె చెప్పాం. అలాగే విద్యుత్ మీటర్లకు కూడ చెప్పాం.. ప్రజలకేమీ మేం అన్యాయం చేయడం లేదు.. ఇలా వైసీపీ చెప్పుకుంటోంది. మరోవైపు కేసీఆర్ మాత్రం.. విద్యుత్ సంస్కరణల వల్ల చాలా అన్యాయం జరుగుతుంది.. అసలు మీటర్లు పెట్టాలంటేనే 700 కోట్లు కావాలి.. ఎవరిస్తారు అంటూ మండిపడ్డారు. జీఎస్టీ విషయంలో కూడ బరాబర్ పోరాడతామని.. ఒప్పుకునే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు.
ఇక్కడ ఎవరికివారు ప్రజల వైపు ఉన్నట్లే కనపడుతోంది. కాని ఒకరు కేంద్రంతో దోస్తీ చేస్తున్నారు.. మరొకరు దుష్మనీ పెంచుకుంటున్నారు. ఎందుకు? ఏపీలో జగన్ కు బిజెపితో లడాయి పెట్టుకునేంత దమ్ము లేదు. ఏదైనా చాటుమాటుగా చేయాల్సిందే తప్ప వేరే ఛాన్స్ లేదు. లేదంటే సీబీఐ కేసు ఉండనే ఉంది. పైగా టీడీపీని తొక్కేయడానికి బిజెపి సహకరిస్తోంది. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనుకుంటున్నారు. ఇది కాక ఆర్ధిక పరిస్ధితి బాగోలేదు.. అందుకే ఈ స్ట్రాటజీ తీసుకుని ముందుకు పోతున్నారు.
తెలంగాణలో పరిస్ధితి అలా లేదు. ఒకవైపు కాంగ్రెస్ వీక్ అయిపోయింది.. బిజెపి రోజురోజుకు రెచ్చిపోతోంది. దాన్ని ఎదుర్కోవాలంటే.. ఇప్పటినుంచే బద్ నామ్ చేయాలే.. లేదంటే.. రేపు ఏకు మేకై కూర్చుంటుంది.. తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు.. ఇప్పటి నుంచే బిజెపిని ప్రజల దృష్టిలో తెలంగాణ దుష్మన్ గా చూపించాలనుకున్నారు.. చూపించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అంటే రెండు చోట్ల రాజకీయ వ్యూహమే ప్రధానం. దాని కోసమే కేంద్రంతో ఎలా ఉండాలనేది డిసైడ్ చేసుకుంటున్నారు. లేదంటే.. వేరేగా ఉండేది. అదే ఏపీలో బిజెపి, టీడీపీ కలిసున్నట్లయితే… జగన్ వైఖరి మరోలా ఉండేది. పోరాటమే .. వేరే దారి లేదంటూ కేసీఆర్ కంటే ఎక్కువ చెప్పేవారు.. కాకపోతే కేసు మెలిక ఉండనే ఉందనుకోండి. తెలంగాణలోనూ అధికారం కోసం టార్గెట్ పెట్టుకోకుండా కేసీఆర్ తో మంచిగా ఉంటే.. జీఎస్టీ పరిహారం, విద్యుత్ సంస్కరణలు రెండిటికీ జై కొట్టేవాడు.
అంతేగాని.. విద్యుత్ మీటర్లు పెడితే.. రేపు వేరే నిబంధనలు వస్తాయి.. లబ్దిదారుల సంఖ్య తగ్గించాల్సి వస్తుందనేది తెలిసినా తెలియనట్లు డ్రామా ఆడుతున్నారు వైసీపీవారు. జీఎస్టీ పరిహారంలో కేంద్రం ప్రతిపాదనకు తలొగ్గటం వల్ల.. ఇప్పటికే ఉన్న కష్టాల్లో రావాల్సిన ఆదాయం రాక.. మరింత కష్టాలు తప్పదు.. అయినా ఎంతో కొంత వస్తున్నాయి సంతోషించండన్నట్లే వైసీపీ కబుర్లు చెబుతోంది. మరోవైపు కేసీఆర్ మాత్రం.. అన్నిటికి ఎదురెళ్తూ.. తన రాజకీయ అజెండాను ముందుకు తెస్తూ బిజెపితో తగాదా పెట్టుకుంటున్నారు.